దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో ఈ వైరస్ దెబ్బకు లక్షలాది కోళ్ళు మృత్యువాతపడుతున్నాయి. దీంతో చిక్కెన్ ధరలు అట్టడుగు స్థాయికి పడిపోయాయి.
నిజానికి బర్డ్ ఫ్లూ సోకినప్పటికీ చికెన్ తినొచ్చని వైద్యులు చెబుతున్నప్పటికీ ప్రజలు వాటిని కొనేందుకు ఆసక్తి చూపట్లేదు. బర్డ్ ఫ్లూ విజృంభణ కారణంగా హర్యానాలోని జింద్ జిల్లా నుంచి ఢిల్లీకి కోళ్ల తరలింపుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఢిల్లీలో కిలో కోడి మాంసం ఖరీదు రూ.15కు పడిపోవడం గమనార్హం.
జింద్ జిల్లా నుంచి రోజుకి సుమారు నాలుగు లక్షల కోళ్లను విక్రయానికి తరలిస్తుంటారు. వాటి ధర ఒక్కసారిగా పడిపోవడంతో కోళ్ల వ్యాపారులు ప్రతిరోజూ సుమారు కోటీ 20 లక్షల రూపాయలు నష్టపోతున్నారు. జింద్ జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమకు మంచి పేరుంది.
ఆ జిల్లాలో 500కు పైగా పౌల్ట్రీ ఫారాలు, 80కి పైగా హ్యాచరీలు ఉంటాయి. అక్కడి నుంచి ఢిల్లీకి విక్రయించే కోళ్ల బరువు సుమారు 8 లక్షల కిలోగ్రాములుంటుంది. కాగా, చికెన్ ను బాగా ఉడికించి తినడం వల్ల నష్టమేమీ ఉండదని వైద్యులు అంటున్నారు.
కాగా, ఇప్పటికే కేరళ రాష్ట్రంలోని ఆలప్పుళ, కొట్టాయం వంటి జిల్లాల్లో చికెన్‌తో పాటు కోడిగుడ్ల విక్రయాలపై నిషేధం విధించిన విషయం తెల్సిందే. అలాగే, కేరళ నుంచి దిగుమతి అయ్యే కోళ్ళు, కోళ్ళ దాణాపై కూడా నిషేధం విధించారు.