నైరుతి రుతుపవనాల విస్తరణకు వాతావరణం అనుకూలంగా ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడుతుందని, ఆ తర్వాత 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తుందని చెప్పింది.
దీని ప్రభావంతో రానున్న రెండు మూడ్రోజుల్లో గోవా, కర్ణాటక, రాయలసీమ, కోస్తాంధ్ర, తమిళనాడులోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు వ్యాపిస్తాయని వెల్లడించింది.
ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
దక్షిణ కోస్తాంధ్రలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
నేడు, రేపు, ఎల్లుండి రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
అలాగే తెలంగాణ సహా మహారాష్ట్రలోని విదర్భ, ఒడిశా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.