లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయపై కన్నుపడిన వారికి ధీటుగా బదులిచ్చినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. స్నేహంగా ఎలా ఉండాలో భారత్‌కు బాగా తెలుసనీ, అదే తేడా వస్తే ఎలా నడుచుకోవాలో కూడా భారత్‌కు బాగానే తెలుసన్నారు.
గాల్వన్ లోయ వద్ద చైనా సైనికులతో జూన్ 15న చోటు చేసుకున్న ఘర్షణలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం మరోమారు స్పందించారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. గాల్వన్ లోయపై కన్ను పడిన వారికి ధీటుగా బదులిచ్చామన్నారు.
స్నేహంగా ఎలా ఉండాలో భారత్‌కు తెలుసని, అలాగే, ఎలా ధీటుగా బదులివ్వాలో కూడా తెలుసని వ్యాఖ్యానించారు. సరిహద్దుల వద్ద దేశాన్ని కాపాడే క్రమంలో 20 మంది సైనికులు ప్రాణ త్యాగం చేశారని ఆయన కొనియాడారు. దేశంలో మనం సమస్యలు లేకుండా జీవించేందుకు సైనికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టారని చెప్పారు.
కరోనా కష్టకాలంలో దేశం స్వావలంబన దిశగా ముందుకు సాగేందుకు పౌరులంతా కృషి చేయాలని మోడీ చెప్పారు. దేశీయ ఉత్పత్తుల వాడకానికే ప్రాధాన్యత ఇవ్వాలని, సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవాలని చెప్పారు.
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి నిబంధనలు పాటించకపోతే ప్రమాదమని తెలిపారు. 2020లో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని ఆయన చెప్పారు. అన్ని సవాళ్లను ధీటుగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు.