సరిహద్దుల్లో చైనా బలగాల హద్దుమీరి చర్యలపై శివసేన స్పందించింది. ఇపుడు రాజకీయాలను పక్కనబెట్టి... చైనా బలగాలను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరం కలిసి కట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చింది.
తూర్పు లడఖ్‌లోని గాల్వన్‌లోయ వద్ద చైనా సైన్యం పాల్పడుతున్న దుందుడుకు చర్యలపై శివసేన పార్టీ తన అధికారిక పత్రిక సామ్నాలో ఓ కథనం ప్రచురించింది. డ్రాగన్ దేశాన్ని ఎదుర్కొనే విషయంపై రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు మాట్లాడాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడింది.
ముఖ్యంగా, లడఖ్ ప్రాంతంలో చైనా నిర్మాణాలు చేపట్టిందని, అరుణాచల్, సిక్కిం సరిహద్దుల నుంచి చైనా సైనికులు ప్రవేశిస్తున్నారని పేర్కొంది. దేశంలోని రాజకీయ విరోధులు సైతం ఒక్కటి కావాల్సిన సమయం వచ్చిందని శివసేన కోరింది. డ్రాగన్ దేశంతో పోరాటం చేయాలని, అన్ని పార్టీల నేతలు దీనిపై మాట్లాడాలని తెలిపింది.
సరిహద్దులో ఉద్రిక్తతలపై చైనా మాటలు ఒకలా ఉన్నాయని, చేతలు మరోలా ఉన్నాయని, సరిహద్దుల వద్ద యుద్ధ ట్యాంకులను మోహరించిందని తెలిపింది. యుద్ధం చేయడానికి సిద్ధంగా లేని చైనా ఆ వాతావరణాన్ని మాత్రం సృష్టించి, ఇండియాను సమస్యల్లోకి నెట్టాలని యత్నిస్తోందని తెలిపింది.