తమిళనాడుకు చెందిన యువకుడు వధువు కావాలంటూ ఊరంతా పోస్టర్లు అంటించారు. విల్లుపురానికి చెందిన 27 యేళ్ళ జగన్ తనకు వధువు కావాలని ఊరిలో పోస్టుర్లు అంటించారు. మంచి భాగస్వామి కోసం తాను వెతుకుతున్నట్లు అందులో పేర్కొన్నాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పైగా, ఈ పోస్టర్లలో తాను ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు. సంప్రదాయ పద్ధతుల్లో భాగస్వామిని వెతికేందుకు ప్రయత్నించాడు. కానీ అది ఫలితం ఇవ్వకపోవడంతో ఈ కొత్త పద్ధతిని ఎంచుకున్నాడు.
ఈ పోస్టర్లలో తన పేరు, కులం, వేతనం, వృత్తి, కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ వివరాలన్నీ స్పష్టంగా ఉండేలా చూసుకున్నాడు. చిన్న స్థలం కూడా తన పేరు మీద ఉందని అందులో చెప్పుకొచ్చాడు. డెనిమ్ షర్ట్ వేసుకున్న ఫొటోను సైతం పోస్టర్‌పై ముద్రించాడు.
తాను ఓ మేనేజరుగానే కాకుండా డిజైనర్నని చెప్పాడు. డిజైనర్‌గా పనిచేస్తున్నప్పుడే ఇలాంటి వినూత్న ఆలోచన తనకు తట్టిందని తెలిపాడు. 'గత ఐదేళ్లుగా నేను భాగస్వామి కోసం వెతుకుతున్నాను. కానీ, నా ప్రయత్నాలేవీ సఫలం కాలేదు.
ఇప్పటివరకు వివిధ అడ్వర్టైజ్మెంట్ల కోసం చాలా పోస్టర్లు డిజైన్ చేశాను. ఈ క్రమంలోనే 'నాకు నేను ఎందుకు ఓ పోస్టర్ డిజైన్ చేసుకోకూడదు?' అన్న ఆలోచన వచ్చింది. ఏదేమైనా.. 90లలో పుట్టినవారికి ఇప్పుడు చాలా కష్టమైన కాలం నడుస్తోంది' అంటూ తన గోడు చెప్పుకున్నాడు.