కరూర్ తొక్కిసలాటలో మృతుల సంఖ్య 40కి చేరుకుంది. ఈ ఘటనలో 67 మంది ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా ఈ ఘటనపై హైకోర్టును ఆశ్రయించారు టీవీకే చీఫ్ విజయ్. ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు కోరుతూ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.
బాధిత కుటుంబాలకు ప్రధాని మోదీ పరిహారం ప్రకటించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ జస్టిస్ ఎం. దండపాణి నివాసంలో తమ న్యాయవాదుల బృందం అత్యవసరంగా ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు టీవీకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ సి.టి.ఆర్. నిర్మల్ కుమార్ వివరించారు.
శనివారం సాయంత్రం కరూర్ లోని వేలుసామిపురంలో జరిగిన ఈ బహిరంగ సభలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇరుకైన దారుల్లో తొక్కిసలాట జరిగి ఊపిరాడక, కాళ్ల కిందపడి అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 9 మంది చిన్నారులు, అధికశాతం మహిళలు ఉన్నారు.
మరో 60 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్‌తో విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు.