తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడు కరూరులో టీవీకే అధినేత విజయ్ ప్రచారంతో ఏర్పడిన తొక్కిసలాట సంఘటన దురదృష్టకరమని తెలిపారు. ఈ ప్రమాదంలో 31 మంది మృతి చెందారని తెలిసి నేను షాక్ అయ్యాను.
మరణించినవారిలో ఆరుగురు పిల్లలు వున్నారనే విషయం తెలుసుకుని ఆవేదనకు గురైయ్యాను. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. గాయపడిన వారికి ఉత్తమ వైద్య చికిత్సను అందించాలని కోరుతున్నట్లు పవన్ సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.
అలాగే ఈ ఘటనపై సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఎక్స్ వేదికగా స్పందిస్తున్నారు. ఇప్పటికే కరూర్ నుంచి తిరుచ్చి మార్గంగా చెన్నైకి చేరుకున్న టీవీకే చీఫ్, నటుడు విజయ్ కరూర్ తొక్కిసలాట ఘటనపై స్పందించారు. మనోవేదనలో మునిగిపోయాను. భరించలేని బాధతో మాటలు రావట్లేదు.
కరూర్‌లో మరణించిన నా సోదరీసోదరీమణుల కుటుంబాలకు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరలో కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.