పెళ్ళి పీటలపై నుంచి ఓ వధువు పారిపోయింది. బ్యూటీపార్లర్‌కి వెళ్లివస్తానని చెప్పి కనిపించకుండాపోయింది. దీంతో ఆదివారం జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని విలుపురం జిల్లా ఎలియత్తూరు గ్రామంలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన శక్తివేల్ అనే వ్యక్తి కుమార్తె దుర్గాదేవి (20) ఓ కళాశాలలో తమిళ భాషా శాస్త్రం అభ్యసిస్తోంది. ఈమెకు అదే ప్రాంతానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది.
ఆదివారం ఉదయం ముహూర్తం కావడంతో వధూవరుల కుటుంబాలు రెండూ పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో వధువు మాత్రం ఈ నెల 2వ తేదీన బ్యూటీపార్లర్‌కు వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు.
ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తెలిసినవారు, బంధువు ఇళ్లలో వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆదివారం జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. కుమార్తె అదృశ్యంపై పోలీసులకు యువతి తండ్రి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.