దేశంలో కరోనా వైరస్ వ్యాప్త నానాటికీ పెరిగిపోతోంది. దీంతో దేశంలో ఆరోగ్య సంక్షోభం తలెత్తే ప్రమాదం ముంచుకొస్తోంది. నానాటికీ పెరిగిపోతున్న కరోనా కేసులను కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్రాలు పూర్తిగా విఫలవుతున్నాయి. దీంతో ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇపుడు బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి కూడా ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు.
దేశంలో కరోనా కట్టడికి కీలక సూచన చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయంపై ఆధారపడటం దండుగ కానీ.. కరోనా నిర్వహణ బాధ్యతలు మంత్రి నితిన్ గడ్కరీకి అప్పగించండి అని ఆయన ప్రధాని మోడీకి సూచించారు.
బుధవారం ఉదయాన్నే ఆయన ఓ ట్వీట్ చేశారు. ముస్లిం చొరబాటుదారులు, బ్రిటీష్ సామ్రాజ్యవాదులను ఎదురించి నిలిచినట్లే ఇండియా కరోనా మహమ్మారిపై కూడా విజయం సాధిస్తుంది.
ఇప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలను లక్ష్యంగా చేసుకునే మరో కరోనా వేవ్‌ను మనం చూడాల్సి వస్తుంది. అందుకే మోదీ ఈ కరోనాపై పోరు బాధ్యతలను వెంటనే గడ్కరీకి అప్పగించాలి. పీఎంవోపై ఆధారపడటం దండగ అని స్వామి ట్వీట్ చేశారు.
తాను ప్రధానమంత్రి కార్యాలయాన్ని విమర్శిస్తున్నానే తప్ప ప్రధానమంత్రిని కాదని కూడా స్వామి వివరణ ఇచ్చారు. ఇక ముందు ఆరోగ్య మంత్రిని తీసేయాలని ఓ వ్యక్తి చేసిన సూచనపైనా స్వామి మరో ట్వీట్‌లో స్పందించారు.
లేదు లేదు హర్షవర్థన్‌కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదు. ఆయనకు అధికారం చెలాయించలేకపోతున్నారు. గడ్కరీతో కలిస్తే ఆయన విజయవంతమవుతారు అని స్వామి స్పష్టం చేశారు. దేశమంతా కొవిడ్ సెకండ్ వేవ్‌తో, ఆక్సిజన్, మందుల కొరతతో అల్లాడుతున్న సమయంలో స్వామి ఈ కీలక సూచన చేయడం గమనార్హం.