Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దళిత వరుడు గుర్రం ఎక్కాడనీ.... గుజరాత్‌లో ఏం చేశారంటే...

Advertiesment
దళిత వరుడు గుర్రం ఎక్కాడనీ.... గుజరాత్‌లో ఏం చేశారంటే...
, మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (13:54 IST)
సాక్షాత్ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో వర్ణ, కుల వివక్ష ఇంకా రూపుమాసిపోలేదు. ఓ దళిత వరుడు గుర్రం ఎక్కాడన్న అక్కసుతో అగ్రవర్ణాలకు చెందినవారు దాడికి తెగబడ్డాడు. ఈ దళిత వరుడు ఓ జవాను కావడం గమనార్హం. అయినప్పటికీ... ఆ అగ్రకులస్థులు అతనిపైదాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వరుడు పేరు ఆకాశ్ కుమార్ కొటియా(22). ఇండియన్ ఆర్మీలో జవానుగా పని చేస్తున్నాడు. జమ్మూకాశ్మీర్ లోయలో విధులు నిర్వహిస్తున్నాడు. వివాహం కోసం తన స్వగ్రామం బనస్‌కంత జిల్లాలోని షరీఫ్‌దాకు వచ్చాడు. గ్రామంలో గుర్రంపై ఊరేగింపుగా పెళ్లి మండపానికి వరుడు వెళ్లాడు. 
 
అంతే.. గుర్రం ఎక్కడమే అతడి పాలిట నేరమైంది. అగ్రవర్ణాల వారి ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. ఠాకూర్ కోలి వర్గానికి చెందిన వారు రాళ్లతో దాడి చేశారు. ఆ సమయంలో పోలీసులు ఉన్నా వారు భయపడలేదు. రాళ్ల వర్షం కురిపించారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. 
 
వివాహ వేడుకలో భాగంగా గ్రామంలో ఊరేగింపుగా వెళ్లడం ఆనవాయితి. అయితే దళితుడు కావడంతో గుర్రం ఎక్కడానికి వీల్లేదని ఠాకూర్ సామాజికవర్గానికి చెందిన పెద్దలు హెచ్చరించారు. దీంతో తనకు రక్షణ కావాలని వరుడు ఆకాశ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఏడుగురు సిబ్బందిని ఇచ్చారు. 
 
పోలీసులు ఉన్నా దాడిని మాత్రం అడ్డుకోలేకపోయారు. ఈ దాడిపై స్పందించిన పోలీసులు.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఠాకూర్ కమ్యూనిటీకి చెందిన 11మందిని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దర్యాఫ్తు చేస్తున్నామని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాలో విజృంభిస్తున్న కరోనా.. వుహాన్ ఆస్పత్రి డైరెక్టర్ మృతి