ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ గురువారం... షేర్-ఈ- కాశ్మీర్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జమ్మూకాశ్మీర్‌కి ఉన్న స్వయం ప్రతిపత్తిని కేంద్రం ఎత్తివేయడంపై స్పందించారు.
ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం చారిత్రాత్మకమని సత్యపాల్ మాలిక్ అభిప్రాయపడ్డారు. ఇది కేవలం చారిత్రక నిర్ణయం కాదని.. జమ్మూకాశ్మీర్, లఢక్‌లు అభివృద్ధి చెందడానికి ఇదో సరికొత్త మార్గమన్నారు. స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం వల్ల జమ్మూకాశ్మీర్ ప్రాంతీయ అస్తిత్వానికి వచ్చిన ఢోకా ఏమీలేదన్నారు. అస్తిత్వం కొల్పోయే అవకాశం ఉందని రాష్ట్ర ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత గవర్నర్ సత్యపాల్ మాలిక్ ... పారా మిలిటరీ ఫోర్స్, పోలీసుల బలగాల సైనిక వందనాన్ని స్వీకరించారు. గత కొద్ది రోజుల క్రితం జమ్మూకాశ్మీర్‌కి ఉన్న స్వయం ప్రతిపత్తిని ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం వరకు అక్కడ పోలీసులు భారీ భద్రత చేపట్టారు. కొద్ది రోజుల క్రితమే 144 సెక్షన్ విధించారు. ఇప్పుడు వాటిని ఎత్తివేయడంతో జమ్మూకాశ్మీరులో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.