Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కశ్మీర్‌లో ఏం జరుగుతోంది... శ్రీనగర్ నుంచి తెలుగు విద్యార్థులు ఎందుకు వెనక్కి వస్తున్నారు?

Advertiesment
కశ్మీర్‌లో ఏం జరుగుతోంది... శ్రీనగర్ నుంచి తెలుగు విద్యార్థులు ఎందుకు వెనక్కి వస్తున్నారు?
, శనివారం, 3 ఆగస్టు 2019 (19:53 IST)
భారత్ అధీనంలోని కశ్మీర్‌లో రెండు రోజులుగా హడావిడి బాగా పెరిగింది. ఆ ప్రాంతంలో భద్రత బలగాల మోహరింపులను కేంద్రం ఉన్నఫలంగా పెంచింది. పర్యాటకులు, అమర్‌నాథ్ యాత్రికులు ఆ ప్రాంతం వదిలివెళ్లిపోవాలని ప్రభుత్వం సూచనలు కూడా చేసింది. ఈ పరిణామాలతో అనేక వదంతులు వ్యాపిస్తున్నాయి. ఆర్టికల్ 35-ఏ, కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో మోదీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతోందని ప్రచారం జరుగుతోంది.

 
శ్రీనగర్ నిట్‌లో చదువుతున్న 130 మంది తెలుగు విద్యార్ధులను సురక్షితంగా తెలంగాణకు చేర్చేలా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె జోషి దిల్లీలోని లోని తెలంగాణభవన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రెసిడెంట్ కమీషనర్ జమ్మూ నుంచి దిల్లీకి తీసుకురావడానికి బస్సులను ఏర్పాటు చేశారని, అక్కడి నుంచి హైదరాబాద్‌కు రైలులో పంపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలంగాణ సమాచార పౌరసంబంధాల శాఖ తెలిపింది.

 
నిట్ విద్యార్ధులతో తెలంగాణ భవన్ అధికారులు ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారని, ఇప్పటికే వారు శ్రీనగర్ నుంచి జమ్మూకు రోడ్డు మార్గాన బయల్దేరారని పేర్కొంది. 

 
‘చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా’
కశ్మీర్‌లోని తాజా పరిణామాల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ నాయకురాలు మహబూబా ముఫ్తీ శుక్రవారం రాత్రి తన ఇంట్లో వివిధ పార్టీల నాయకులతో ఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా, పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జాద్ లోన్, పీపుల్స్ మూమెంట్ నాయకుడు ఫైసల్ కూడా సమావేశానికి హాజరయ్యారు.

 
కశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో స్థానికులు బెంబేలెత్తుతున్నారని ఈ సమావేశం అనంతరం ముఫ్తీ మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. మునుపెన్నడూ తాను ఇలాంటి పరిస్థితి చూడలేదని ఆమె వ్యాఖ్యానించారు. కశ్మీర్‌లో పరిస్థితి మెరుగైందని చెప్పుకుంటున్న కేంద్రానికి ఇక్కడ భద్రత బలగాల మోహరింపులను పెంచే అవసరం ఎందుకు వచ్చిందని ముఫ్తీ ప్రశ్నించారు.

 
''ఆర్టికల్ 35ఏ, జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో మార్పులు చేస్తారని వదంతులు వస్తున్నాయి. ఇస్లాంలో చేతులు జోడించడానికి అనుమతి లేదు. అయినా, నేను చేతులు జోడించి, ప్రధానమంత్రిని అలా చేయొద్దని అభ్యర్థిస్తున్నా'' అని ముఫ్తీ అన్నారు. ముఫ్తీ సహా ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు ఆ తర్వాత రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మలిక్‌ను కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న గందరగోళానికి తెరదించి, వదంతుల వ్యాప్తిని అరికట్టాలని ఆయన్ను వారు కోరారు.

 
అయితే, రాష్ట్రంలో పరిస్థితులు సాఫీగానే ఉన్నాయని గవర్నర్ వ్యాఖ్యానించినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది. ''భద్రత బలగాలకు సంబంధించిన ఆదేశాలను, వేరే అంశాలతో కలిపి చూస్తున్నారు. అందుకే ఇలాంటి వదంతులు పుడుతున్నాయి. ప్రధాన పార్టీల నాయకులకు నేను అదే కోరా. ఇలా వేర్వేరు అంశాలను కలిపి చూడొద్దని వాళ్ల వాళ్లకు అనుచరులకు సూచించాలని చెప్పా. వదంతులను నమ్మొద్దు'' అని గవర్నర్ సత్యపాల్ మలిక్ వ్యాఖ్యానించినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

 
జమ్మూకశ్మీర్ ప్రభుత్వం శుక్రవారం భద్రతపరమైన ఆదేశాలు జారీ చేస్తూ కశ్మీర్‌లో మిలిటెంట్లు దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని.. పర్యాటకులు, అమర్‌నాథ్ యాత్రికులు ఈ ప్రాంతం విడిచి వెళ్లిపోవాలని సూచించింది. ఈ ఆదేశాలు జారీ అయిన అనంతరం వదంతుల వ్యాప్తి మరింత ఎక్కువైంది.

 
జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భయబ్రాంతులను ఎందుకు సృష్టిస్తున్నారని ఆయన ట్విటర్ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించారు. ''పహల్‌గామ్, గుల్‌మర్గ్ నుంచి ప్రజలను పంపించేందుకు ప్రభుత్వ బస్సులను వాడుతున్నారు. యాత్రకు ప్రమాదం పొంచి ఉంటే, గుల్‌మర్గ్‌ను ఎందుకు ఖాళీ చేయిస్తున్నారు?'' అని ఒమర్ ట్వీట్ చేశారు.

 
ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారంతోనే కేంద్ర హోంశాఖ భద్రతపరమైన కొన్ని సూచనలు చేసిందని జమ్మూకశ్మీర్ డివిజనల్ కమిషనర్ బషీర్ అహ్మద్ ఖాన్ అన్నారు. ''ఎక్కడా కర్ఫ్యూ విధించాలని ఆదేశాలేవీ రాలేదు. రేపు పాఠశాలలు నడుస్తాయి. శాంతియుత వాతావారణం కొనసాగేందుకునే హోంశాఖ ఆ సూచనలు చేసింది'' అని ఆయన అన్నారు.

 
మరోవైపు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలోఉంచుకుని ఆగస్టు 15వరకు శ్రీనగర్‌కు వచ్చే, వెళ్లే విమానాల టికెట్ల రద్దు, రీషెడ్యూలింగ్‌పై రుసుములు మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రకటించింది. అమర్‌నాథ్ యాత్రికులు క్షేమంగా తిరిగివచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ పఠాన్‌కోట్ జిల్లా అధికారులను ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజ్ భవన్ లో వైభవంగా గవర్నర్ జన్మదిన వేడుకలు