చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదముద్ర వేయకపోవడంపై ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ అసహనం వ్యక్తం చేశారు. ఈ బిల్లును ప్రవేశపెట్టిన ఏళ్లు గడిచిపోతున్నప్పటికీ ఆమోదం పొందలేదన్నారు. ఇది నార్త్ ఇండియా మెంటాలిటీ అని వాపోయారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించకపోవడంపై ఆయన అసంతృప్తితో పాటు అసహనం వ్యక్తం చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశ్యంతోనే ఈ రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చినట్టు గుర్తుచేశారు.
అయితే, ఏళ్లు గడుస్తున్నా పార్లమెంటులో ఈ బిల్లుకు ఇప్పటికీ ఆమోదముద్రపడలేదని చెప్పారు. దీనికి కారణంగ మహిళా నాయకత్వాన్ని అంగీకరించేందుకు దేశం ఇప్పటికీ సిద్ధంగా లేదని ఆయన అన్నారు. మహిళల రిజర్వషన్లపై కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పటి నుంచి తాను పార్లమెంటులో మాట్లాడుతూనే ఉన్నానని చెప్పారు.
కానీ, ఇప్పటివరకు ఆ బిల్లుకు ఆమోదం లభించలేదని చెప్పారు. మహిళా రిజర్వేషన్లపై పార్లమెంటులో మాట్లాడిన తర్వాత తమ పార్టీ ఎంపీలు కూడా లేచి వెళ్లిపోతుండటాన్ని తాను చూశానని, అంటే తమ పార్టీ నేతలకు కూడా మహిళా రిజర్వేషన్లు ఇష్టం లేదనే విషయం గ్రహించానని శరద్ పవార్ తెలిపారు.