భారతీయ జనతా పార్టీకి చెందిన వివాదాస్పద ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హైదరాబాద్ నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ ప్రవక్తపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే దీనికి కారణం. మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి మాట్లాడుతూ రాజాసింగ్ ఓ వీడియోను విడుదల చేశారు. దీన్ని చూసిన ముస్లిం ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో రాజాసింగ్ ఇంటివద్ద భారీ సంఖ్యలో పోలీసులను మొహరించి, ఆ తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత ఆయన్ను షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాజాసింగ్ వీడియోపై ఎంఐఎం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ముస్లిం మనోభావాలు దెబ్బతీశారంటూ పలు పోలీస్ స్టేషన్‌ల ఎదుట ముస్లింలు ఆందోళనకు దిగారు.
ముఖ్యంగా, బషీర్‌బాగ్‌లోని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, హిందువులు, ముస్లింల మధ్య మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.