హైదరాదాబాద్ నగరానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, వివాదాస్పద నేత రాజాసింగ్‌పై వేటుపడింది. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆయన విడుదల చేసిన ఓ వీడియోనే ఇందుకు కారణంగా నిలిచింది.
ఈ వ్యవహారంలో హైదరాబాద్ నగర పోలీసులు ఆయన్ను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ పార్టీ క్రమశిక్షణ సంఘం భావించింది. దీంతో రాజాసింగ్‌ను సస్పెండ్ చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. పార్టీకి సంబంధించిన అన్ని బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తక్షణం తప్పిస్తున్నట్టు ప్రకటించింది.
అలాగే పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో కూడా పది రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ షోకాజ్ నోటీస్ జారీచేసింది. వచ్చే నెల రెండో తేదీలోపు వివరణ ఇవ్వాలని కోరింది.