కేవలం ఆన్‌లైన్ క్లాస్‌లు మాత్రమే అయితే ఖచ్చితంగా ఫీజులు తగ్గించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సాధారణ స్కూలు తరగతులతో పోలిస్తే ఈ ఆన్‌లైన్ క్లాస్‌ల నిర్వహణ తల్లిదండ్రులకు భారంగా మారిందని, అదేసమయంలో పాఠశాలలకు నిర్వహణ ఖర్చు బాగా తగ్గిందన్నారు. అందువల్ల ఫీజులు తగ్గించాల్సిందేనని తేల్చి చెప్పింది.
గత యేడాది కాలంలో దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడివున్నాయి. కానీ ఫీజులు విషయంలో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు వెనక్కి తగ్గలేదు. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తూనే పూర్తిస్థాయి ఫీజులను వసూలు చేస్తున్నాయి.
ఈ అంశాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. కేవలం ఆన్‌లైన్ క్లాసులే అయితే ఖచ్చితంగా ఫీజులు తగ్గించాల్సిందే అని స్పష్టం చేసింది. ఆన్‌లైన్ క్లాస్‌ల కారణంగా స్కూలు నిర్వహణ ఖర్చులు తగ్గాయి కాబట్టి ఆ ప్రయోజనాన్ని తల్లిదండ్రులకు బదిలీ చేయాలని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది.
కొవిడ్ కారణంగా వాళ్లు పడిన ఇబ్బందులను స్కూలు యాజమాన్యాలు అర్థం చేసుకోవాలని, ఆ మేరకు వారికి ఉపశమనం కలిగించాలని ఆదేశించింది. విద్యార్థులకు అందించని వసతులకు కూడా ఫీజులు వసూలు చేయడం లాభార్జనే అవుతుందని, అది మానుకోవాలని హితవు పలికింది.
ఇక గతేడాది లాక్డౌన్ కారణంగా చాలా కాలం స్కూళ్లు తెరవలేదు. దీని కారణంగా పెట్రోల్/డీజిల్, కరెంటు, నిర్వహణ ఖర్చు, నీటి ఛార్జీలు, స్టేషనరీ ఛార్జీలు వంటివి మిగిలిపోయాయి. వీటిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి అని సుప్రీం ధర్మాసనం స్పష్టంసింది.