Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నోర్మూసుకుని... చేతులు కట్టుకుని కూర్చోలేం .. సుప్రీం ఘాటు వ్యాఖ్యాలు

నోర్మూసుకుని... చేతులు కట్టుకుని కూర్చోలేం .. సుప్రీం ఘాటు వ్యాఖ్యాలు
, మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (15:14 IST)
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశం పెను సంక్షోభంలో చిక్కుకుంది. ఇలాంటి సంక్షోభ సమయంలో తాము నోరు మూసుకుని కూర్చోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 
 
కరోనా సంక్షోభంపై స్పందించే హక్కు అన్ని రాష్ట్రాల్లోని హైకోర్టులకు ఉందని, ఆయా హైకోర్టుల చర్యలను తాము అనుసంధానం చేసుకుంటూ పోతామని స్పష్టం చేసింది. కరోనా పరిస్థితులపై సుప్రీం కోర్టు సుమోటో విచారణను చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ విచారణను మంగళవారం జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్ర భట్ లతో కూడిన ధర్మాసనం కొనసాగించింది.
 
ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులకు ఉండే అధికారాన్ని తాము నివారించలేమని, కరోనా పరిస్థితులపై ఆయా హైకోర్టులకు తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొంది. హైకోర్టులు పరిష్కరించలేని విషయాల్లో తాము సాయం చేస్తామంది. 
 
కాగా, అంతకుముందు సుమోటోగా కేసు విచారణను చేపట్టిన మాజీ సీజేఐ ఎస్ ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. కరోనాపై జాతీయస్థాయి ప్రణాళికను వెల్లడించాల్సిందిగా ఆదేశించింది.
 
ఇప్పటికే ఆ ప్రణాళికను సుప్రీంకోర్టుకు అందజేశామని ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మంగళవారం వెల్లడించారు. దీనిపై మరో రెండు రోజుల్లో విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ప్రతి రోజూ కరోనా పరిస్థితులపై విచారణ చేస్తామని స్పష్టం చేసింది.
 
సైన్యం, పారామిలటరీ బలగాలు, రైల్వేలకు చెందిన వైద్య వనరులను ఏమైనా వాడుకునే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికుందా? అని జస్టిస్ రవీంద్ర భట్ ప్రశ్నించారు. క్వారంటైన్, వ్యాక్సినేషన్, బెడ్ల కోసం ప్రస్తుతం ఆర్మీ సాయం తీసుకోవచ్చని, దీనిపై కేంద్ర ప్రణాళిక ఏంటని ఆయన ప్రశ్నించారు. 
 
కరోనా టీకాలపై వివిధ సంస్థలు విధించిన ధరలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టీకాల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ వ్యాక్సిన్లు వేయడమే మేలైన మార్గమని వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనావైరస్ కోరలు పీకేసేందుకు సీఎం వైఎస్ జగన్ పక్కా వ్యూహం