దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో రాజకీయ పార్టీల ర్యాలీలకు అనుమతి ఇవ్వడంపై ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు మండిపడింది. రెండో దశ వ్యాప్తి తీవ్రం కావడానికి ఎన్నికల సంఘానిదే బాధ్యత అని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఎన్నికల అధికారులపై హత్య కేసు నమోదు చేయాల్సి ఉంటుందని మద్రాస్ హైకోర్టు మండిపడింది.
ఓట్ల లెక్కింపు సమయంలో తన నియోజకవర్గంలో కొవిడ్ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని ఓ ప్రజాప్రతినిధి చేసిన వినతిపై విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ఈ విధంగా స్పందించింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్‌కు మీదే ఏకైక బాధ్యత. అందుకే ఎన్నికల అధికారులపై హత్య కేసు నమోదు చేయాలి అని మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సాంజిబ్ బెనర్జీ అభిప్రాయపడ్డారు.
ఎన్నికల ప్రచారంలో కరోనా ఆంక్షల అమలులో ఈసీ పూర్తిగా విఫలమైందన్నారు. ప్రచారాల వేళ ఎన్నికల అధికారులు వేరే గ్రహంలో ఉన్నారా? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం కొవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా ఎన్నికల సంఘం సరైన ప్రణాళికలు అమలు చేయకపోతే మే 2వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిలిపివేస్తామని హెచ్చరించారు.
ప్రజారోగ్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్న విషయాన్ని రాజ్యంగబద్ధ సంస్థలు గుర్తుంచుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ నుంచి రక్షణ పొంది మనుగడ సాధించడమే అత్యంత కీలకం. మిగతావన్నీ వీటి తర్వాతే వస్తాయి. ఒక పౌరుడు బతికి ఉన్నప్పుడే అతని ప్రజాస్వామ్య హక్కులను ఆస్వాదించగలుగుతాడు అని మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు.
కాగా, మే 2వ తేదీ కౌంటింగ్ రోజు తీసుకోబోయే కొవిడ్ కట్టడి చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శితో కలిసి ప్రణాళికను రూపొందించాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. వీటిని ఏప్రిల్ 30వ తేదీన హైకోర్టు ముందుందచాలని ఆదేశించింది. ప్రణాళికను అందించకపోతే ఓట్ల లెక్కింపు నిలిపివేస్తామని హెచ్చరించింది.