దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి చిన్నమ్మ జైలు నుంచి విడుదలవుతుందా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. తమిళనాడు రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన చిన్నమ్మ శశికళ శిక్షా కాలం ముగించుకుని, జనవరి 27న బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదల కావడం ఖాయమని భావిస్తున్న 'అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం' అభిమానులు, ఆమెకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం చెన్నైలోని పార్టీ కార్యాలయంలో సమావేశమైన ఆమె అనుచరులు, ఆమెకు స్వాగతం పలికేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న విషయమై చర్చించారు. ఆపై ఆమె నేరుగా మెరీనా బీచ్‌కు వెళ్లి, జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించి శపథం చేస్తారని చెప్పారు.
ఆ తర్వాత ఆమె తన ఇంటికి చేరుకుంటారని పార్టీ నేతలు అంటున్నారు. చిన్నమ్మకు స్వాగతం పలుకుతూ 65 చోట్ల ఆహ్వాన సభలను నిర్వహించాలని నిర్ణయించామని, ఈ ఏర్పాట్లపై దృష్టి పెట్టామని వెల్లడించారు.