Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శశికళకు మరో చిక్కు.. పది కోట్లు కడతారు సరే.. ఆ డబ్బు ఎలా వచ్చింది..?

శశికళకు మరో చిక్కు.. పది కోట్లు కడతారు సరే.. ఆ డబ్బు ఎలా వచ్చింది..?
, శనివారం, 31 అక్టోబరు 2020 (10:07 IST)
అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ జరిమానా రూ.10 కోట్లను కట్టేసి జైలు నుంచి ముందస్తుగా విడుదల కావడం ఖాయమని, మరో రెండుమూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు కోర్టు నాలుగేళ్ల చొప్పున జైలు శిక్షతోపాటు చెరో రూ.10 కోట్ల చొప్పున జరిమానా విధించింది. 14 ఫిబ్రవరి 2017 నుంచి వీరు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. వీరి శిక్షాకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 14తో ముగియనుంది. 
 
అయితే, సత్ప్రవర్తన కారణంగా శశికళ ముందే విడుదలవుతారన్న వార్తలు ఇటీవల షికారు చేస్తున్నాయి. ఆమె తరపు న్యాయవాది కూడా పలుమార్లు ఈ విషయం చెప్పారు. అయితే, జైలు అధికారులను మభ్యపెట్టి జైలు నుంచి బయటకు వచ్చి షాపింగులు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శశికళ సత్ప్రవర్తన కిందికి ఎలా వస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు.
 
ఈ విషయాలన్నీ పక్కనపెడితే, జైలుకు ఆమె కట్టబోయే రూ.10 కోట్ల జరిమానా చుట్టూ ఇప్పుడు మరికొన్ని చిక్కులు ముసురుకున్నాయి. ఒకవేళ శశికళ ఆ రూ.10 కోట్లు చెల్లించి బయటపడినా, అంత సొమ్మును ఎక్కడి నుంచి తెచ్చారని ఐటీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. 
 
ఇప్పటికే పలుమార్లు ఐటీ దాడులను ఎదుర్కొన్న శశికళకు ఇది కొత్త తలనొప్పి అవుతుందని చెబుతున్నారు. దీంతో ఆ పది కోట్ల రూపాయలపై ఐటీశాఖ నుంచి స్పష్టత వచ్చిన తర్వాత, జైళ్ల శాఖ నుంచి ప్రభుత్వానికి సమాచారం, ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంటుందని, దీంతో శశికళ విడుదల విషయంలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టర్కీ, గ్రీస్‌లో భారీ భూకంపం.. 22కి చేరిన మృతుల సంఖ్య