శశికళకు పెరోల్ మంజూరు... దినకరన్‌కు షాక్..(వీడియో)
అక్రమాస్తుల కేసులో బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళకు ఐదు రోజుల పెరోల్ లభించింది. దీంతో ఆమె శుక్రవారం జైలు నుంచి విడుదల కానున్నారు.
అక్రమాస్తుల కేసులో బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళకు ఐదు రోజుల పెరోల్ లభించింది. దీంతో ఆమె శుక్రవారం జైలు నుంచి విడుదల కానున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భర్త నటరాజన్‌ను చూసేందుకు 10 రోజుల పెరోల్ మంజూరు చేయాలంటూ ఆమె జైలు అధికారులను విన్నవించుకున్నారు. దీన్ని పరిశీలించిన జైలు అధికారులు ఐదు రోజుల పెరోల్‌ను మంజూరు చేశారు. అదేసమయంలో వ్యక్తిగత అవసరాల కోసమే పెరోల్‌ను వినియోగించుకోవాలని... రాజకీయ కార్యక్రమాలను హాజరు కావొద్దన్న నిబంధన విధించింది.
అన్నాడీఎంకే బహిష్కృత నేత టీవీవీ దినకరన్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. రెండాకుల గుర్తుల అంశాన్ని కొంత కాలం వాయిదా వేయాలంటూ ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను గురువారం మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, అన్నాడీఎంకే పార్టీ గుర్తు విషయంలో సెప్టెంబర్ 15న మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు త్వరగతిన తేల్చేందుకు ఎన్నికల సంఘం శుక్రవారం నుంచి విచారణ ప్రారంభించింది. హైకోర్టు ఆదేశం మేరకు ఈనెల 31వ తేదీలోపు రెండుకాల గుర్తు వ్యవహారాన్ని తేల్చనుంది.
మరోవైపు.. తమిళనాడు గవర్నర్‌గా బన్వరీలాల్ పురోహిత్ శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేయించారు. నగరంలోని రాజ్‌భవన్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి తమిళనాడు సీఎం పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, మంత్రులు, విపక్ష నేత, డీఎంకే కార్యాచరణ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఇతర విపక్ష నేతలు హాజరయ్యారు.