భారత్ భాబీజీ పాపడ్‌తో ఆగిపోతే రష్యా మాత్రం కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసి తమ స్వావలంబన చాటుకుందని శివసేన అభిప్రాయపడింది. ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని శివసేన తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ పార్టీ పత్రి సామ్నా వేదికగా విమర్శలు గుప్పించారు.
అయోధ్య భూమిపూజ సందర్భంగా ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ క్వారంటైన్‌లోకి వెళ్తారా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రధాని మోడీ క్వారంటైన్ నిబంధనలను పాటించరా? అని ఆయన నిలదీశారు.
'ఆగస్టు 5న జరిగిన అయోధ్య రామ మందిర భూమి పూజలో మహంత నృత్య గోపాల్ దాస్ పాల్గొన్నారు. ఆయన మాస్కు పెట్టుకోలేదు. ప్రధాని మోడీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొన్నారు. మోడీ భక్తితో గోపాల్ దాస్ చేతిని కూడా పట్టుకున్నారు. అందుకే మోడీ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలి' అని రౌత్ వ్యాఖ్యానించారు.
ఇక... కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ మేఘవాల్‌పై కూడా రౌత్ విరుచుకుపడ్డారు. భాబీజీ పాపడ్ తింటే కరోనా రాదన్న మేఘవాల్ వ్యాఖ్యలపై రౌత్ మండిపడ్డారు. 'భారత్ భాబీజీ పాపడ్ దగ్గరే ఆగిపోయింది. రష్యా మాత్రం కోవిడ్-19కు వ్యాక్సిన్ కనిపెట్టింది. ఆత్మ నిర్భరతను చూపించింది. మనం మాత్రం ఆత్మ నిర్భర భారత్‌పై ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటాంట అని రౌత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
రష్యా వ్యాక్సిన్ ఏమాత్రం నమ్మదగింది కాదని ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమైతే, తన కుమార్తెకు కూడా వ్యాక్సిన్ డోసు ఇచ్చి దేశంలో ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కొనియాడారు. ఆత్మనిర్భర్ అంటే ఏమిటో రష్యా ప్రపంచానికి తొలిపాఠం నేర్పిందన్నారు.