Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాదంలో కేపీ శర్మ ఓలీ.. నేపాల్‌లోనే చుక్కెదురు.. బాబర్‌ని కూడా అలా అంటారేమో?

Advertiesment
Laughable
, గురువారం, 16 జులై 2020 (13:01 IST)
నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు. కేపీ శర్మ రాముడిపై చేసిన వ్యాఖ్యలకు నేపాల్‌లోనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ఓలీ సొంత పార్టీ నేతలే ఆయన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో నేపాల్ ప్రధాని పరువు పూర్తిగా గంగలో కలిసినట్లయింది. పైగా నేపాల్ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నేత కమల్ థాపా.. నేపాల్ ప్రధాని వ్యాఖ్యలపై మండిపడ్డారు. 
 
ఒక ప్రధాని తన పొరుగుదేశం సంస్కృతికి సంబంధించిన విషయంపై ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేయడం తగదనీ, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి బదులు, ప్రధాని ఓలీ భారత్-నేపాల్ సంబంధాలను నాశనం చేయాలని చూస్తున్నట్టు ఉందనీ కమల్ థాపా విమర్శించారు. కాగా ఓలీ వ్యాఖ్యలు నేపాల్-ఇండియా సంబంధాలను, రెండు దేశాల ప్రజలు, నాయకుల మధ్య సంబంధాలను దెబ్బతీసేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నట్లు నేపాల్ ప్రధాన వార్తాపత్రిక ఖాట్మండు పోస్ట్ కూడా వ్యాఖ్యానించడం విశేషం. 
 
ఇప్పటికే ఓలీ వ్యాఖ్యలు భారత్‌లో ప్రధాన రాజకీయ పక్షాలు, సామాన్య ప్రజల్లో కూడా తీవ్ర ఆగ్రహావేశాలు రేపాయి. చూస్తుంటే ఓలీ భారత్‌ను పాలించిన బాబర్ చక్రవర్తిని కూడా తమ దేశీయుడే అనేటట్లు ఉన్నారని శివసేన ధ్వజమెత్తింది. ప్రధాని ఓలీ వ్యాఖ్యలు కొంపముంచనున్నాయని గ్రహించిన నేపాల్ విదేశాంగ శాఖ వివరణ ఇచ్చుకుంది. ఓలీ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని, నేపాలీ భాషలో రామాయణాన్ని రచించిన ఆదికవి భాను భక్త ఆచార్య 207వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కేపీ శర్మ ఓలీ ఈ విధంగా మాట్లాడారని తెలుపుతూ వివాదాన్ని తేలికపర్చాలని చూసింది.  
 
అయితే నేపాల్‌పై భారత్ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే భారత్ భూభాగంలో ఉన్న లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీలను తమ ప్రాంతాలుగా చూపిస్తూ కొత్త మ్యాప్ జారీ చేసి దానికి పార్లమెంటులో కూడా ఆమోదం వేయించుకోవడంపై భారత్ మండిపడుతోంది.

అంతటితో ఆగకుండా నేపాల్ ప్రధాని భారత వ్యతిరేక వ్యాఖ్యలను పనిగట్టుకుని చేస్తూ వస్తున్నారని భారత్ విమర్శిస్తోంది. ప్రత్యేకించి చైనా అండ చూసుకునే ఓలి ఇలాంటి దుస్సాసానికి పాల్పడుతున్నారని భారత్ ఫైర్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత అస్త్రం... సుప్రీం తలుపుతట్టనున్న సచిన్ పైలట్?