ప్రారంభానికి ముందే కూలిపోయింది.. రూ.389 కోట్లు నీటిపాలు
ఆటవిక పాలనతోపాటు అవినీతి అక్రమాలకు నిలయంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో రూ.389 కోట్లు నీటిపాలయ్యాయి. ఈ రాష్ట్రంలోని భగల్‌పూర్‌లో రూ.389.31 కోట్ల వ్యయంతో చేపట్టిన గతేశ్వర్ పంథ్ కెనాల్ ప్రాజెక్టు ప్రారంభిం
ఆటవిక పాలనతోపాటు అవినీతి అక్రమాలకు నిలయంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో రూ.389 కోట్లు నీటిపాలయ్యాయి. ఈ రాష్ట్రంలోని భగల్‌పూర్‌లో రూ.389.31 కోట్ల వ్యయంతో చేపట్టిన గతేశ్వర్ పంథ్ కెనాల్ ప్రాజెక్టు ప్రారంభించడానికి 24 గంటల ముందే అపశ్రుతి చోటుచేసుకుంది.
కెనాల్‌లోకి భారీగా నీరు రావడంతో అక్కడ నిర్మించిన గోడ కుప్పకూలింది. ఈ ప్రాజెక్టును బీహార్ సీఎం నితీశ్‌కుమార్ బుధవారం ప్రారంభించాల్సి ఉంది. అయితే.. ఈ ప్రమాదం కారణంగా ప్రారంభోత్సవాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. కెనాల్ గోడ కూలిపోవడంతో నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది.
బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల రైతులకు నీటి సదుపాయాన్ని కల్పించేందుకు ఈ ప్రాజెక్టును నిర్మించారు. పనులు పూర్తికావడంతో ప్రయోగాత్మకంగా నీటిని నింపారు. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్టు వద్ద నిర్మించిన గోడ కొట్టుకుపోయింది.
ఖహలగాన్, ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని పలు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. అక్కడ మునిగిపోయిన ఇళ్లలో ఖహల్‌గాన్ సివిల్ జడ్జి, సబ్‌జడ్జి నివాసాలు కూడా ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు.