జర్నలిస్టుల పట్ల ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సానుభూతి చూపారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలను అవగాహన చేస్తూ, నిత్యం వార్తల సేకరణలో ఉండే జర్నలిస్టులకు ఆయన ఎక్స్‌గ్రేషియా సౌకర్యం కల్పించారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ బారినపడి చనిపోయే జర్నలిస్టు కుటుంబానికి రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా కల్పించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.
కరోనా వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంలో విలేకరుల పాత్ర అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వాళ్లంతా నిబద్ధతతో పని చేస్తున్నారని కొనియాడారు.
కరోనా వైరస్ సోకి ఎవరైనా జర్నలిస్టు చనిపోతే ఆ వ్యక్తి కుటుంబానికి వెంటనే రూ.15 లక్షలు అందిస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. పాత్రికేయుల సంక్షేమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్న సీఎంకు ఒడిశా ప్రభుత్వ మీడియా సలహాదారు మనాస్ మంగరాజ్ కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, కరోనా వైరస్‌పై వార్తలు కవర్ చేస్తున్న జర్నలిస్టులందరికీ ఆరోగ్య బీమా కల్పించాలని కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి సహచర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు లేఖ రాశారు. ముంబై, చెన్నై, భోపాల్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పలువురు పాత్రికేయులు కరోనా బారిన పడ్డారు.