చెన్నై కేంద్రంగా ప్రసారాలు చేస్తున్న సత్యం టీవీలో పని చేసే సిబ్బందిలో 27 మందికి కరోనా సోకింది. వీరికి జరిగిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఈ సంస్థలో పని చేసే ఉద్యోగులందరినీ క్వారంటైన్‌కు తరలించారు.
స్థానిక రాయపురం, కల్‌మండపం, కామరాజ్ పార్క్ వీధి, ఒకటో నంబరులో ఉన్న భవనం నుంచి ఈ సత్యం టీవీ కొనసాగుతోంది. ఈ టీవీలో పని చేసే 24 యేళ్ల సబ్ ఎడిటర్‌కు ఈ వైరస్ సోకింది. దీంతో అతన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అంతేకాకుండా, అతని ద్వారా సబ్ ఇన్‌స్పెక్టరుగా పనిచేస్తున్న తండ్రికి సోకిందా? లేదా? అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
అలాగే, ఈ సంస్థలో పని చేసే 94 మంది సిబ్బందికి కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 27 మందికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ఇంకా మరికొందరి ఫలితాలు రావాల్సివుంది. దీంతో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చెన్నై నగర పాలక సంస్థ అధికారులు వెల్లడించారు.
అదేసమయంలో ఈ ఉద్యోగులకు చెందిన కుటుంబ సభ్యులు, వీరు కలిసిన స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్ చేయడం జరిగింది. అలాగే, రాయపురంలోని ఈ సత్యం టీవీ కార్యాలయాన్ని కూడా మూసివేశారు.
ఈ సబ్ ఎడిటర్ మాత్రమే కాకుండా ఓ తమిళ దినపత్రికలో పనిచేసే విలేకరికి కూడా ఈ వైరస్ సోకింది. ఈ విషయం ఆదివారం తేలింది. ఈ విలేకరి ఆరోగ్య శాఖ కార్యదర్శి బీలా రాజేష్ నిర్వహించిన మీడియా మీట్‌కు వెళ్లడంతో ముందస్తు జాగ్రత్తగా ఆమెకు కూడా కరోనా పరీక్షలు చేశారు. కాగా, సోమవారం ముంబైలో 53 మంది విలేకరులకు ఈ వైరస్ సోకిన విషయం తెల్సిందే.