టాటా సన్స్ మాజీ చైర్మన్ దివంగత రతన్ టాటా తన ఆస్తుల్లో సింహ భాగాన్ని దాతతృత్వానికే కేటాయించారు. మిగిలిన దానిని కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగులు, పెంపుడు జంతువులకు చెందేలా వీలునామా రాశారు. గత యేడాది అక్టోబరు 9వ తేదీన ఆయన మరణించారు. తనకున్న రూ.3,800 కోట్ల ఆస్తిపై ఆయన రాసిన వీలునామా తాజాగా బయటకు వచ్చింది. 2022 ఫిబ్రవరి 23వ తేదీన ఆయన ఈ వీలునామాపై సంతకం చేశారు.
ఆస్తిలో సింహభాగాన్ని రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్టులకు కేటాయించారు. ఈ రెండు సంస్థలు ఆ నిధులను దాతృత్వానికి వినియోగిస్తాయి. వీలునామాలో రాయని షేర్లు, పెట్టుబడులు, ఇతర ఆస్తులూ ఈ దాతృత్వ సంస్థలకే చెందుతాయని వీలునామా రతన్ టాటా పేర్కొన్నారు.
రూ.800 కోట్లలోని మూడో వంతును టాటా సంస్థ మాజీ ఉద్యోగి, తనకు అత్యంత ఆప్తులైన మోహిని ఎం దత్తాకు ఇచ్చారు. ముంబైలోని జుహూలోని భవనంలో వాటా, వెండి వస్తులు, కొన్ని ఆభరణాలను తన సోదరుడైన 82 యేళ్ల జిమ్మ నావల్ టాటాకు రాసిచ్చారు. తన ప్రాణస్నేహితుడైన మెహ్లీ మిస్త్రీకి అలీబాగ్‌లోని ఇంటిని, మూడు తుపాకులను ఇచ్చారు. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్టాక్స్, ఇతర విలువైన వాటిలో కలిపి మొత్తం రూ.800 కోట్ల ఆస్తుల్లో మూడో వంతును తన సవతి తల్లి కుమార్తెలు షరీన్ జేజీబాయి, డియాన్నా జేజీబాయికి రతన్ టాటా ఇచ్చారు.