ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ రాజీనామా చేశారు. బీజేపీ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా, ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత అధిక రోజులు సీఎంగా కొనసాగిన ఈ చావల్ బాబా ఇపుడు తన సీఎం పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్‌కు పంపించారు.
ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యతను తానే తీసుకుంటానని, కేంద్ర నాయకత్వంపై మోపనని ఈ సందర్భంగా వెల్లడించారు. పార్టీ నాయకులతో కలసి ఫలితాలపై సమీక్ష జరుపుతామని వెల్లడించారు. రాష్ట్ర సమస్యలపైనే ఎన్నికలు జరిగాయని, వీటికి జాతీయ అంశాలతో సంబంధం లేదని పేర్కొన్నారు.
కాగా, 18 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఛత్తీస్‌గఢ్‌కు రమణ్‌సింగే తొలి ముఖ్యమంత్రి. అప్పటి నుంచి గత 15 ఏళ్లుగా ఆయనే సీఎంగా కొనసాగుతున్నారు. ఏ బీజేపీ సీఎం కూడా ఇంతకాలం అధికారంలో కొనసాగింది లేదు.
2003, డిసెంబరు 7వ తేదీన తొలిసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆ తర్వాత 2008, 2013లోనూ అధికారంలోకి వచ్చారు. ప్రధాని కాక ముందు నరేంద్ర మోడీ 4,610 రోజుల పాటు నిరంతరాయంగా గుజరాత్ సీఎంగా కొనసాగగా, రమణ్‌సింగ్ ఈ ఏడాది ఆగస్టులో సీఎంగా ఐదు వేల రోజులు పూర్తిచేసుకున్నారు. నరేంద్ర మోడీ తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించిన తొలి బీజేపీ సీఎంగా గుర్తింపుపొందారు.