దేశంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సోమవారం నుంచి రాజస్థాన్ రాష్ట్రంలో 15 రోజల పాటు లాక్డౌన్ అమలు చేయనున్నారు. మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ఆంక్షలు రాష్ట్రమంతా పాటించనున్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఆ రాష్ట్ర హోంశాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఈ లాక్డౌన్ సమయంలో అత్యవసర సర్వీసులు మినహా అన్ని ఆఫీసులు మూసి ఉంటాయని ప్రభుత్వం పేర్కొన్నది. నిత్యావసర వస్తువుల షాపులు సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటాయి. కూరగాయలు రాత్రి ఏడు వరకు అమ్మే అవకాశం కల్పించారు. పెట్రోల్ పంపులు రాత్రి 8 వరకు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు.
ముఖ్యంగా, కొత్త ఆదేశాల ప్రకారం.. మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, సినిమా హాళ్లు, ఆలయాలను మూసివేయనున్నారు. అన్ని విద్యా కేంద్రాలు, కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలను కూడా మూసి ఉంచనున్నారు. అన్ని కమర్షియల్ ఆఫీసులను మూసివేయాలని ఆదేశించారు.
బస్టాపులు, మెట్రో స్టేషన్లు, ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణికులు టికెట్లు చూపించాల్సి ఉంటుంది. గర్భిణులు హాస్పిటళ్లకు ప్రయాణించే అనుమతి ఇచ్చారు. టీకా తీసుకోవడానికి అనుమతి ఇచ్చారు. పెళ్లి, అంత్యక్రియలకు 50 మందికి పర్మిషన్ ఇచ్చారు. టెలికాం, ఇంటర్నెట్, పోస్టల్, కేబుల్ సర్వీసులను తెరిచి ఉంచనున్నారు. అలాగే, బ్యాంకులు కూడా యధావిధిగా పని చేయనున్నాయి.
ఇదిలావుంటే, మే నెల మొదటి వారంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉంటుందట. ఈ విషయాలను ఐఐటీ కాన్పూర్ తన పరిశోధనలో తేల్చింది. ఈ కాలంలో చాలా మంది కరోనా వైరస్‌కు గురవుతారని తెలిపింది. ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ పద్మశ్రీ మనీంద్ర అగర్వాల్ నేతృత్వంలో ఈ అధ్యయనం కొనసాగింది.
కంప్యూటర్ ఆధారిత మోడల్‌పై ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్, అతని బృందం గత వారం రోజుల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతున్న కరోనా సగటు కేసులను అధ్యయనం చేసింది. వీరి అధ్యయనం ప్రకారం మహారాష్ట్రలో కేసులు తగ్గుముఖం పట్టగా.. 7 రాష్ట్రాల్లో కేసులు ఎక్కువవుతున్నాయి.
మహారాష్ట్రలో రాబోయే కొద్ది రోజుల్లో కేసులు పూర్తిగా తగ్గిపోతాయి. ఇదే సమయంలో, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, రాజస్థాన్‌లలో ఏప్రిల్ 20-30 మధ్య గరిష్ఠంగా కరోనా వ్యాప్తి ఉంటుంది.