కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. రాజస్థాన్‌లో ఇవాళ్టి నుంచి 15 రోజుల పాటు లాక్‌డౌన్ అమలు చేయనున్నారు. మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ ఆంక్షలు రాష్ట్రమంతా పాటించనున్నారు.
ఆదివారం రాత్రి ఆ రాష్ట్ర హోంశాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సర్వీసులు మినహా అన్ని ఆఫీసులు మూసి ఉంటాయని ప్రభుత్వం పేర్కొన్నది. నిత్యావసర వస్తువుల షాపులు సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటాయి.
కూరగాయలు రాత్రి ఏడు వరకు అమ్మే అవకాశం కల్పించారు. పెట్రోల్ పంపులు రాత్రి 8 వరకు తెరిచి ఉంటాయి. కొత్త ఆదేశాల ప్రకారం.. మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, సినిమా హాళ్లు, ఆలయాలను మూసివేయనున్నారు. అన్ని విద్యా కేంద్రాలు, కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలను కూడా మూసి ఉంచనన్నారు. అన్ని కమర్షియల్ ఆఫీసులను మూసివేయాలని ఆదేశించారు.
బస్టాప్స్, మెట్రో స్టేషన్లు, ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణికులు టికెట్లు చూపించాల్సి ఉంటుంది. గర్భిణులు హాస్పిటళ్లకు ప్రయాణించే అనుమతి ఇచ్చారు. టీకా తీసుకోవడానికి అనుమతి ఇచ్చారు. పెళ్లి, అంత్యక్రియలకు 50 మందికి పర్మిషన్ ఇచ్చారు. టెలికం, ఇంటర్నెట్, పోస్టల్, కేబుల్ సర్వీసులను తెరిచి ఉంచనున్నారు