రాజస్థాన్ రాష్ట్రంలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిణికి కూడా గృహహింస వేధింపులు తప్పలేదు. ఈ వేధింపులకు పాల్పడుతున్న భర్త కూడా ఒక ఐఏఎస్ కావడం గమనార్హం. పైగా, భర్త వేధింపులను తట్టుకోలేని ఆ మహిళా ఐఏఎస్ అధికారిణి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖలో సహాయ కార్యదర్శిగా సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న భారతి దీక్షిత్ అనే ఐఏఎస్ అధికారిణి తన భర్త నుంచి గృహహింస వేధింపులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆమె జైపూర్ పోలీసులను ఆశ్రయించారు. నేపథ్యంలో ఇటీవల జైపూర్ పోలీసులను ఆశ్రయించారు.
సామాజిక న్యాయం, సాధికారత విభాగంలో డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న తన భర్త.. ఐఏఎస్ అధికారి ఆశిష్ వివాహం అయినప్పటి నుంచి తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని, ఈ మధ్య వేధింపులు మరింతగా ఎక్కువయ్యాయని భారతి దీక్షిత్ ఆరోపించారు.
అత్తింటివారి నుంచి తన ప్రాణాలకు హాని ఉందని జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తామిద్దరం 2014 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ అధికారులమని భారతి దీక్షిత్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
2014లో తమ వివాహం అయినప్పటి నుంచి ఆశిష్ మోడీ తరచూ మద్యం సేవించి.. తనను శారీరకంగా, మానసికంగా హింసించేవాడని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.