Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వయనాడ్‌ను వదులుకున్న రాహుల్ ... అక్కడ నుంచి ప్రియాంక గాంధీ పోటీ!!

rahul priyanka

వరుణ్

, మంగళవారం, 18 జూన్ 2024 (10:46 IST)
ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేశారు. ఇందులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌‍బరేలీ, కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌ల నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇపుడు ఒక స్థానాన్ని త్యజించాల్సి ఉండటంతో ఆయన వయనాడ్‌ను వదులుకునేందుకు సమ్మతించారు. అయితే, అక్కడ నుంచి తన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రకటించారు. వయనాడ్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ పోటీ చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ వివరాలను విలేకర్లకు వెల్లడించారు. 
 
సోమవారం ఖర్గే నివాసంలో ఆయనతో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, ప్రియాంకా గాంధీ సమావేశమయ్యారు. రెండు స్థానాల్లో గెలిచిన ఎంపీలు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన 14 రోజుల్లో ఏదో ఒక స్థానాన్ని ఖాళీ చేయాలని నిబంధనలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో.. రాయబరేలీ, వయనాడ్‌లలో రాహుల్ ఏ స్థానాన్ని నిలుపుకోవాలనే అంశంపై చర్చించారు. 
 
అనంతరం ఖర్గే విలేకర్లతో మాట్లాడుతూ తరతరాలుగా నెహ్రూ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉన్నందువల్ల రాయబరేలీ నుంచే రాహుల్ ఎంపీగా కొనసాగాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. వయనాడ్ ప్రజలూ రాహుల్‌నే కోరుకుంటున్నప్పటికీ నిబంధనలు అనుమతించడం లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పోరాడటానికి అవసరమైన శక్తిని వయనాడ్ ప్రజలు తనకు అందించారని, ఆ విషయాన్ని ఎన్నడూ మర్చిపోనని చెప్పారు. 
 
రాయబరేలీ, వయనాడ్‌లతో తనకు భావోద్వేగపూరిత సంబంధం ఉందని, వాటిల్లో దేనిని ఎంచుకోవాలన్న నిర్ణయం సులభం కాలేదని వెల్లడించారు. రాహుల్ లేని లోటు లేకుండా తాను చూస్తా నని వయనాడ్ ప్రజలకు ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. కష్టపడి పని చేసి మంచి ప్రజాప్రతినిధి అనిపిచుకుంటానన్నారు. కాగా, వయనాడ్‌లో రాహుల్‌పై పోటీ చేసి ఓడిపోయిన కేరళ బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్.. రాహుల్ వయనాడ్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని విమర్శించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కు వై ప్లస్ సెక్యూరిటీ.. బుల్లెట్ ప్రూఫ్ కారు!!