ఎగ్జిట్ పోల్స్ ఓ జిమ్మిక్కు అని, ప్రత్యర్థి పార్టీలు ఇలాంటి పనులు బాగానే చేస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఆమె స్పందిస్తూ, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని, మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టాలన్న ఉద్దేశ్యంతోనే ప్రత్యర్థి పార్టీలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని, ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ముఖ్యంగా, ఓట్ల లెక్కింపు జరిగే రోజైన గురువారం కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్స్ రూమ్స్ వద్ద నిఘా ఉంచాలని, తమ శ్రమకు ఖచ్చితంగా ఫలితం దక్కుతుందన్న నమ్మకం తనకు ఉందని ఆ ఆడియోలో ప్రియాంక పేర్కొన్నారు.
కాగా, కేంద్రంలో మళ్లీ బీజేపీయే అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో ఆ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. అదేసమయంలో, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.