దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగొచ్చని హెచ్చరించాయి. ఈ క్రమంలో రైల్వే శాఖను నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. డ్రోన్, ఐఈడీతో దాడులు జరగొచ్చని వెల్లడించాయి. నదీ మార్గాల్లో ఉగ్రవాదులు దేశంలోకి చొరబడవచ్చని హెచ్చరించాయి. ముంబైకి కీలక కుట్రదారు తహవ్వుర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకొచ్చి విచారిస్తున్న తరుణంలో ఈ అలెర్ట్ చేయడం గమనార్హం.
గత 2008 నవంబరు నెల 26వ తేదీన 10 మంది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు అరేబియా సముద్ర మార్గం మీదుగా ముంబైకి చేరుకుని ఆ తర్వాత ముంబై మహానగరంలో మారణహోమం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ దాడుల్లో దాదాపు 175 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.
అలాగే, 18 మంది భద్రతా సిబ్బంది కూడా అశువులు బాసారు. అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ విభాగం చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబై అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ సలాస్కర్‌లు అమరులయ్యారు. రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు కాదా. 26/11 ముంబై దాడుల్లో కీలక పాత్రను పోషించాడు.