భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఇందులో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో వారసత్వ, కటుంబ రాజకీయాలకు ఎంతమాత్రం తావులేదన్నారు. వారసులకు టిక్కెట్ దక్కలేదంటే అందుకు కారణం తానేనని ఎంపీలకు కుండబద్ధలుకొట్టినట్టు చెప్పారు. అదేసమయంలో ఇతర పార్టీల వారసత్వ రాజకీయాలపై బీజేపీ నేతలు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీలో కుటుంబ రాజకీయాలు పనిచేయవు. ఇతర పార్టీల్లోని వారసత్వ రాజకీయాలపై మనం పోరాడాలి. కాబట్టి పార్టీలోని నేతల వారసులకు టిక్కెట్లు ఇవ్వకపోతే చింతించవద్దు. అలా జరగడానికి పూర్తి బాధ్యత నాదే. వారసత్వ రాజకీయాలకు మనం వ్యతిరేకం కదా" అని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా "కశ్మీర్ ఫైల్స్" సినిమా గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు సమాచారం. ప్రతి ఒక్కరూ "కశ్మీర్ ఫైల్స్" సినిమా చూడాలని కోరారు. 1990ల్లో కశ్మీర్ పండిట్లపై జరిగిన అకృత్యాలు, వారి వలసల నేపథ్యంలో తెరకెక్కించిన సినిమాను ప్రధాని మోడీ ప్రశంసించారు.
"కొన్నివర్గాలు ఇప్పటికీ కశ్మీర్ పండిట్లపై జరిగిన అకృత్యాలను తొక్కిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. గతంలోనూ వాళ్ళు అలాగే చేశారు. ఇపుడూ అదే చేయాలని చూస్తున్నారు. నిజాలు బయటకు రాకుండా చేస్తున్నారు. ప్రతి ఒక్క ఎంపీ కశ్మీర్ ఫైల్స్ సినిమాను చూడాలి" అని ప్రధాని నరేంద్రమోడీ కోరారు.