దేశ రాజధానిలో క్రాఫ్ట్ ఫెస్ట్ జరుగుతోంది. దీన్ని కేంద్రం మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఈ ఎగ్జిబిషన్ పేరు హునార్ హాత్. బుధవారం ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ఈ ప్రదర్శన ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను ప్రధాని నరేంద్ర మోడీ తిలకించి, సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో అత్యంత ప్రాచూర్యం పొందిన, ఇష్టమైన వంటకంగా పేరొందిన లిట్టీచోకాను రుచి చూశారు.
తన అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశం ముగిసిన వెంటనే ప్రధాని నేరుగా ఈ ప్రదర్శన జరిగే ప్రాంతానికి వెళ్లి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికిగురిచేశారు. ఎగ్జిబిషన్‌లో హస్త కళల స్టాల్స్‌ని సందర్శించి వ్యాపారులతో మాట్లాడారు.
అనంతరం లిట్టి చోకా తిని మట్టి కప్పులో చాయ్ తాగారు. లిట్టి చోకా తిన్నందుకు రూ.120 చెల్లించారు. అనంతరం కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీతో కలిసి మట్టి గ్లాసుల్లో టీ తాగారు. ఇద్దరి ఛాయ్ డబ్బులు రూ.40 మోడీనే చెల్లించారు. ఢిల్లీ క్రాఫ్ట్స్ ఫెస్ట్‌లో సుమారు 50 నిమిషాల పాటు ప్రధాని గడిపారు. అన్ని స్టాల్స్ తిరిగి అక్కడున్న వస్తువులను వీక్షించారు.
'కౌషల్ కో కామ్' థీమ్ ఆధారంగా ఫిబ్రవరి 23వ తేదీ వరకు ఈ ప్రదర్శన జరుగనుంది. దేశవ్యాప్తంగా 50 శాతం మందికిపైగా మహిళలతో సహా మాస్టర్ కళాకారులు, హస్తకళాకారులు, పాక నిపుణులు హునార్ హాత్‌లో పాల్గొంటున్నారు. ప్రజలు ఆస్వాదించడానికి అందుబాటులో ఉన్న అనేక రాష్ట్రాల సాంప్రదాయ రుచికరమైన పదార్ధాలతో 'బావార్చిఖానా' సెక్షన్ ఏర్పాటు చేశారు. మాస్టర్ హస్తకళాకారులను శక్తివంతం చేసే ప్రయత్నంలో భాగంగా భారతదేశం అంతటా ఇలాంటి 'హాత్'లు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.