విమాన ప్రయాణికులకు కేంద్రం గట్టివార్నింగ్ ఇచ్చింది. కరోనా నిబంధనలతో పాటు.. మార్గదర్శకాలను పాటించని విమాన ప్రయాణికుల పేర్లను నో ఫ్లై జాబితాలో చేర్చుతామని హెచ్చరించింది.
ఇదే అంశంపై కేంద్రం పౌర విమానాయానశాఖా మంత్రి హర్దిప్ సింగ్ పూరి స్పందిస్తూ, కరోనా నిబంధనలను పాటించని ప్రయాణికులపై నిషేధం విధిస్తామన్నారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు ఇచ్చామని, వాటిని పాటించని ప్రయాణికులను నో ఫ్లై జాబితాలో పెట్టాల్సిందిగా విమానాశ్రయాల ప్రాధికార సంస్థకు ఇప్పటికే ఆదేశాలు పంపించామని ఆయన చెప్పారు.
నిబంధనలను పాటిస్తే కరోనాపై విజయం సాధించవచ్చన్నారు. కానీ, చాలా మంది నిర్లక్ష్యం కారణంగానే సమస్యలు వస్తున్నాయన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ని ఆదేశించామన్నారు.
పదే పదే చెప్పినా పట్టించుకోని ప్రయాణికులను.. మళ్లీ విమానం ఎక్కకుండా నిషేధిత ప్రయాణికుల జాబితాలో పెడతామని హెచ్చరించారు. బస్సులు, రైళ్లలో ప్రయాణం కన్నా విమానాల్లో ప్రయాణం సురక్షితమైనదని చాలా మంది అనుకుంటున్నారని మంత్రి పూరి చెప్పుకొచ్చారు.