Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?

అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
, మంగళవారం, 23 మార్చి 2021 (16:48 IST)
వందల కోట్ల సంవత్సరాల కిందట అంగారకుడిపై ప్రవహించిన నీరంతా ఎటుపోయింది? - చాలా కాలంగా వీడని మిస్టరీ ఇది. ఇపుడీ ప్రశ్నకు తమ దగ్గర సమాధానం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ నీటిలో చాలా భాగం గ్రహం పైపొరలో బందీగా ఉంది. ఈ ప్రాచీన జలం.. అంగారకుడి రాళ్లలో ఖనిజాల రూపంలో ఉంది. ఈ ఆవిష్కరణల గురించి 52వ లూనార్ అండ్ ప్లానెటరీ సైన్స్ కాన్ఫరెన్స్‌లో చర్చించారు. సైన్స్ జర్నల్‌లోనూ ప్రచురించారు.

 
ఈ గ్రహం మీద నుంచి నీరు కోట్ల సంవత్సరాల కాలంలో క్రమంగా ఎలా మాయమైపోయిందనే అంశంపై శాస్త్రవేత్తలు ఒక కంప్యూటర్ నమూనాను అభివృద్ధి చేశారు. నాలుగు వందల కోట్ల సంవత్సరాల కిందట మార్స్ ఇప్పటికన్నా వెచ్చగా, తడిగా ఉండేది. దాని ఉపరితల వాతావరణం మరింత చిక్కగా ఉండి ఉండొచ్చు. నీరు భారీగా ప్రవహించింది. రాళ్లను కోతలు పెడుతూ నదులు ప్రవహించాయి. గ్రహ శకలాలు ఢీకొనటంతో ఏర్పడిన బిలాలతో ఈ గ్రహం నిండిపోయింది.

 
అంగారక గ్రహం ఉపరితలం మొత్తాన్నీ 100 మీటర్ల నుంచి ఒక కిలోమీటరు లోతు వరకూ కప్పేయటానికి సరిపోయేంత నీరు ఒకప్పుడు ఆ గ్రహం మీద ఉండి ఉండొచ్చు. దాదాపు ఒక వంద కోట్ల సంవత్సరాల కిందట మార్స్ వాతావరణం ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా చల్లని, ఎడారి గ్రహంగా మారింది. ''అంగారకగ్రహం తొలి నాళ్లలో మరింత తడిగా ఉండేదని మనకు చాలా కాలంగా తెలుసు. కానీ ఆ నీరంతా ఏమైందనే ప్రశ్న ఇన్నాళ్లుగా అలాగే మిగిలిపోయింది'' ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ పీటర్ గ్రిండ్రాడ్ పేర్కొన్నారు. తాజా అధ్యయనంలో ఆయన పాత్ర లేదు.

 
లండన్‌లోని నాచురల్ హిస్టరీ మ్యూజియానికి చెందిన డాక్టర్ పీటర్ బీబీసీతో మాట్లాడుతూ.. ''ఆ నీటిలో కొంత భాగం అంతరిక్షంలోకి పోయిందని మార్స్ వాతావరణం మీద చేసిన అధ్యయనాల ద్వారా మనకు ఇప్పటికే తెలుసు. ఇక ఉపరితలానికి కేవలం కొంచెం కింది భాగంలో గల మంచు నిల్వలు.. కొంత నీరు ఘనీభవించిందని మనకు చెప్తున్నాయి'' అని పేర్కొన్నారు.

 
అంతరిక్షంలోకి పరారీ
భూమికి అయస్కాంత రక్షణ కవచం - మాగ్నెటోస్ఫియర్ - ఉంది. భూమి నుంచి వాతావరణం బయటి విశ్వంలోకి జారిపోకుండా నిరోధించటానికి ఈ కవచం సాయపడుతుంది. కానీ మార్స్ మాగ్నెటిక్ షీల్డ్ బలహీనంగా ఉంది. దానివల్ల ఆ గ్రహం మీది నీటిలోని మౌలిక మూలకాలు గ్రహం మీది నుంచి జారిపోయి ఉండవచ్చు. అయితే.. నీటిలోని ఒక రసాయన మూలకమైన హైడ్రోజన్ ఇప్పుడు ఆ గ్రహపు వాతావరణం నుంచి జారిపోతున్న రేటును చూస్తే.. అంతా ఇలాగే జరిగి ఉండకపోవచ్చునని సూచిస్తోంది.

 
హైడ్రోజన్ నష్టపోతున్న రేటు.. గతంలో కూడా ఇప్పటి స్థాయిలోనే ఉందని భావించినట్లయితే.. ఇలా నష్టపోయిన నీటి పరిమాణం చాలా స్వల్పంగా ఉంటుందని తాజా అధ్యయనం సహ రచయిత ఎవా లింఘాన్ షెల్లర్ చెప్పారు. ఆమె పసడేనాలోని కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్‌టెక్) శాస్త్రవేత్త. మరో మాటలో చెప్తే.. అంగారకుడి మీద నీటిలో చాలా భాగం వాతావరణం వెలుపలికి కాకుండా మరెక్కడికో వెళ్లి ఉండాలి.

 
ఈ శాస్త్రవేత్తల బృందం రూపొందించిన కంప్యూటర్ నమూనా ఫలితాలు.. మార్స్ మీద తొలి నాళ్లలో గల నీటిలో 30 శాతం నుంచి 99 శాతం వరకూ నీరు.. ఖనిజాలలోకి చేరి, ఆ గ్రహపు పైపొరలలో నిక్షిప్తమై ఉందని చూపుతున్నాయి. ''మార్స్ మిషన్‌ల నుంచి సేకరించిన సమాచారాన్ని అధ్యయనం చేయటం ద్వారా.. నీరు రూపం మారిపోయిన ఆధారాలు లభించటం సాధారణమైన విషయమని, అరుదైన విషయం కాదని స్పష్టమైంది'' అని ఈ అధ్యయనం మరో సహ రచయిత, కాల్‌టెక్‌కే చెందిన ప్రొఫెసర్ బెథనీ హెల్మన్ వివరిస్తున్నారు.

 
''గ్రహపు పైపొర మార్పులకు లోనైనపుడు.. అది నీటిని తీసుకుని ఖనిజాలతో కలిపి దాచేస్తుంది. అంటే వాస్తవంలో ఆ నీరు చిక్కుబడిపోతుంది'' అని చెప్పారామె. అంగారకుడి మీది నీటిలో అత్యధిక భాగం 410 కోట్ల సంవత్సరాల నుంచి 370 కోట్ల సంవత్సరాల కిందటి వరకూ క్రమంగా మాయమవుతూ పోయిందని ఈ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మార్స్ చరిత్రలో ఈ కాలాన్ని 'నోచియాన్ పీరియడ్'గా అభివర్ణిస్తున్నారు.

 
మార్స్ మీద వాతావరణ మార్పు...
''మార్స్ భూవిజ్ఞానశాస్త్రం, వాతావరణం, జీవం అంశాల్లో నీరు కేంద్ర బిందువుగా ఉంటుంది. కాబట్టి మార్స్ ఎక్స్‌ప్లొరేషన్‌లో నీటి అన్వేషణ ప్రధానాంశంగా ఉంది'' అని నాసా మార్స్ అన్వేషణ కార్యక్రమానికి సారథ్యం వహిస్తున్న శాస్త్రవేత్త డాక్టర్ మైఖేల్ మేయర్ చెప్పారు. ''మార్స్ మీద ఎంత నీరు ఉండేది, అది ఎలా పోయింది, ఇప్పుడు ఎక్కడ ఉండొచ్చు అనేది అర్థం చేసుకోవటానికి తాజా పరిశోధన చాలా ముఖ్యభూమిక పోషిస్తుంది'' అని ఆయన పేర్కొన్నారు.

 
''ఈ అధ్యయనం నిజానికి మనకి చెప్తున్న విషయం ఏమిటంటే.. మార్స్ మీది నీటిలో చాలా భాగం ఆ గ్రహపు రాళ్లల్లో బందీగా ఉందని. ఈ తరహా ప్రక్రియ భారీ స్థాయిలో నీటిని నిల్వ చేయగలదు'' అని డాక్టర్ పీటర్ తెలిపారు. ''మార్స్ ఏర్పడిన తర్వాత ఓ 150 కోట్ల సంవత్సరాలకు దాని మీది ద్రవరూప నీటిలో చాలా భాగం మాయమైపోయినప్పటికీ.. నేడు మనం దాని ఉపరితలం మీద.. ప్రస్తుతం పెర్సీవరాన్స్ రోవర్ అన్వేషిస్తున్న జెజీరో క్రేటర్ వంటి ప్రాంతాల్లో.. నీటితో కూడిన ఖనిజాలను చూస్తున్నాం'' అని ఆయన వివరించారు. ''గ్రహ శాస్త్రంలో మార్స్ తొలినాళ్ల వాతావరణం అనేది అతి ముఖ్యమైన అంశం. మార్స్ మీద నీరు మాయమవటానికి కారణమైన ప్రక్రియను అర్థం చేసుకోవటానికి ఈ అధ్యయనం తోడ్పడుతుంది'' అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లయినా ఫోనులో మాట్లాడుతోందని మందలించిన తల్లి... పురుగుల మందుతాగి.. .