పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా జవాన్లను పొట్టన పెట్టుకుంది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ. ఈ దాడికి మాస్టర్ మైండ్‌గా ఆ సంస్థ కమాండర్ అబ్దుల్ రషీద్ ఘాజీపై సైన్యం అనుమానాలు వ్యక్తం చేసింది. ఆత్మాహుతి దాడికి దిగిన అదిల్‌కు ఘాజీయే శిక్షణ ఇచ్చాడనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆ సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజర్‌కు ఘాజీ ప్రధాన అనుచరుడిగా ముద్రవేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో జైష్-ఎ-మొహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను ఉత్తర్ ప్రదేశ్ యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్) అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సహరన్‌పూర్‌లోని దేవ్‌బంద్‌లో వారిని పోలీసులు అరెస్టు చేశారు.
ఎటిఎస్ అధికారులు షహరన్‌పూర్‌లో చేపట్టిన తనిఖీల్లో ఇద్దరు ఉగ్రవాదులతో సహా ఒక షాప్ ఓనర్‌ను, 12 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి రెండు ఆయుధాలు, భారీ మొత్తంలో మందుగుండు స్వాధీనం చేసుకున్నారు.