సూరత్ నగరంలో విషాదకర సంఘటన చోటుచేసుకున్నది. బుధవారం నాడు రెండేళ్ల పిల్లవాడు 13వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ జారి కిందపడ్డాడు. అతడిని కాపాడాలనే తాపత్రయంతో తల్లి కూడా అతిడితో పాటు కిందికి దూకేసింది. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
పూర్తి వివరాలను చూస్తే... సూరత్ లోని అల్తాన్ ప్రాంతంలో మార్తాండ్ హిల్స్ అపార్టుమెంట్లో పూజ తన భర్తతో కలిసి నివాసం వుంటోంది. వీరికి రెండేళ్ల బాబు వున్నాడు. వీరు అపార్టుమెంటులోని సి-వింగ్ లో 6వ అంతస్తులో వుంటున్నారు. ఐతే బుధవారం నాడు తన బ్లౌజ్ తెచ్చుకునేందుకు 13వ అంస్తులోని లేడీస్ టైలర్ వద్దకు వచ్చింది. ఆమెతో పాటు తన రెండేళ్ల కుమారుడిని కూడా వెంట తీసుకువచ్చింది. బాల్కనీలో ఆ పిల్లవాడు ఆడుకుంటూ గ్రిల్స్ లోపల దూరి అక్కడి నుంచి కిందపడ్డాడు.
అతడు కింద పడుతున్న సమయంలో పూజ ఆందోళనతో అతడిని పట్టుకునేందుకు పరుగుతీసింది. ఆలోపుగానే పిల్లవాడు కిందపడిపోయాడు. అతడిని కాపాడాలన్న ఉద్దేశ్యంతో ఆమె కూడా మరో ఆలోచన లేకుండా కిందికి దూకేసింది. దీనితో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఐతే ఆమె మరణం పట్ల పూజ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్త వల్ల ఆమె చనిపోయి వుంటుందనే అనుమానం వ్యక్తపరిచారు. ప్రాధమికంగా విచారణ జరిపిన పోలీసులు భార్యాభర్తల మధ్య ఎలాంటి మనస్పర్థలు, గొడవలు లేవని నిర్థారించారు. పోస్టుమార్టం రిపోర్టు కోసం మృతదేహాలను తరలించారు.