దిల్లీ మార్కెట్లో లభ్యత లేమి కారణంగా.. ఉల్లి ధరలు రికార్డు స్థాయికి దిశగా పెరుగుతున్నాయి. కిలో ఉల్లి ధర రూ.80 వరకు పలుకుతున్నట్లు తెలుస్తోంది.
దేశ రాజధాని దిల్లీలో ఉల్లి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. జాతీయ రాజధాని ప్రాంతంలో కిలో ఉల్లి గరిష్ఠంగా రూ.80 వరకు విక్రయమవుతోంది. కేవలం వారం వ్యవధిలో ధరలు 45 శాతం పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే.. ప్రస్తుతం ఉల్లి ధరలు దాదాపు మూడింతలు పెరిగినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది.
2018 నవంబర్లో కిలో ఉల్లి రూ.30 నుంచి రూ.35 మధ్య ఉంది. దేశంలో ఉల్లి లభ్యత పెంచేందుకు ఎగుమతులపై ఆంక్షలు విధించడం వంటి ప్రభుత్వ చర్యలున్నప్పటికీ.. ధరలు అదుపులోకి రాకపోవడం గమనార్హం. ఉల్లి ఎక్కువగా పండించే మహారాష్ట్ర, కర్ణాటకలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో.. ఉల్లి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఫలితంగా మార్కెట్లో ఉల్లి లభ్యత తగ్గి.. ధరలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. దిల్లీలో మాత్రమే కాకుండా.. దేశంలో చాలా ప్రాంతాల్లో ఉల్లి ధరలు అధికంగా ఉన్నాయి. అయితే దిల్లీలో ఉల్లి ధరలు పెరగటం అనేది రాజకీయ పరంగా సున్నితమైన అంశం.
ధరలు ఎప్పుడు తగ్గుతాయంటే..?
ఉల్లి ధరలు త్వరలోనే తిరిగి సాధారణ స్థాయికి చేరుతాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ నుంచి త్వరలోనే తాజా ఉల్లి మార్కెట్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా లభ్యత పెరిగి ధరలు అదుపులోకి వస్తాయని వివరించారు.