Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

నేరస్తులను వదిలేసి గ్రామస్తులపై కేసులు పెడతారా?: టీడీపీ

Advertiesment
villagers
, శుక్రవారం, 1 నవంబరు 2019 (19:08 IST)
వైసీపీ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి అనంతపురంలోని నేమకల్లు  గ్రామంలో మూతపడిన కంకర క్వారీ నుంచి అనధికారికంగా రాత్రివేళల్లో క్వారీయింగ్‌ చేయిస్తూ, పెద్దపెద్ద రాళ్లను అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్నాడని,  క్వారీలో జరుగుతున్న పేలుళ్లకు భయపడిన ఆ ఊరిప్రజలు పేలుళ్లు జరిపినవారిని స్వయంగా పట్టుకున్నారనే అక్కసుతో వారిపై ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టి బెదిరింపులకు గురిచేస్తున్నాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.

శుక్రవారం గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అక్టోబర్‌ 11న అనంతపురం జిల్లాలోని బొమ్మనహల్‌ మండలం, నేమకల్లు గ్రామంలో కాపు రామచంద్రారెడ్డి పేరుమీదున్న వైట్‌మెటల్‌క్వారీలో సాయంత్రం 5గంటలకు భారీ శబ్దంతో పేలుడు రావడంతో స్థానికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారన్నారు.

క్వారీ వద్దకు వెళ్లి చూసిన గ్రామస్తులు అక్కడ పనిచేస్తున్న ఐదుగురిని, వారు ఉపయోగించిన పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకొని, బొమ్మనహళ్‌ ఎస్సై రమణారెడ్డికి, స్వయంగా అప్పగించడం జరిగిందన్నారు. ఏవిధమైన అనుమతులు లేకుండా, మూసిఉన్న క్వారీలో పేలుళ్లకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, వారికి పేలుడు పదార్థాలు ఎక్కడినుంచి వచ్చాయో విచారించాలని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారని కాలవ పేర్కొన్నారు.

రాజకీయాలకు అతీతంగా, నేరంచేసిన వారిని, గ్రామస్తులంతా కలిసి స్వయంగా పోలీసులకు అప్పగిస్తే, వారిపై ఏవిధమైన కేసు నమోదుచేయకపోవడం విచారకరమన్నారు. అధికారపార్టీ నేత ప్రోద్భలంతో నేరంచేసిన వారిని వదిలేయడంతో వారు, తమను పట్టించినవారిపైనే తిరిగి కర్ణాటకలో ఎస్సీఎస్టీ కేసులు పెట్టడం జరిగిందని మాజీమంత్రి ఆవేదన వ్యక్తంచేశారు.

రాయదుర్గం ఎమ్మెల్యేనే కర్ణాటకలోని వన్నళి గ్రామానికి చెందిన వారిచేత, పేలుళ్లను అడ్డుకున్న నేమకల్లు వాసులపై అక్రమకేసులు పెట్టించడం జరిగిం దన్నారు. అక్టోబర్‌11న నేరంచేస్తూ పట్టుబడినవారిని వదిలేసి, పదిరోజులతర్వాత అక్టోబర్‌ 21న బళ్లారి పీఎస్‌లో వారిని పట్టుకున్నవారిపై కేసులు ఎలాపెట్టారని శ్రీనివాసులు ప్రశ్నించారు.

ఘటనతర్వాత  బొమ్మనహళ్‌ పోలీసులు మఫ్టీలో నేమకల్లులో తిరుగుతూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేయడం మొదలుపెట్టారని, దాంతో తమకు, తమ కుటుంబాలకు ఏమవుతుందోనన్న భయంతో క్వారీలో పేలుళ్లను అడ్డుకున్నవారంతా కర్ణాటక, ఆంధ్రాలోని పలుప్రాంతాల్లో తలదాచుకోవడం జరిగిందన్నారు.

మానవహక్కుల సంఘానికి లిఖితపూర్వక ఫిర్యాదు : క్వారీపేలుళ్ల ఘటనలో తప్పుడుకేసులు మోపబడిన నేమకల్లు వాసులతో కలిసి జరిగినదురాగతాలపై  జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదుచేసినట్లు మాజీమంత్రి తెలిపారు. మానవ హక్కుల కమిషన్‌ ప్రతినిధులకు జరిగిన అంశాలను వివరించామన్నారు.

నేరస్తులను పోలీసులకు అప్పగించడమే గ్రామస్తులు చేసిన నేరమా అని కాలవ ప్రశ్నించారు. 14నెలల క్రితం నేషనల్‌గ్రీన్‌ ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) ఆదేశాలతో మూతపడిన క్వారీని అనుమతుల్లేకుండా తెరిచి అక్రమంగా క్వారీయింగ్‌ చేసినవారిని వదిలేసి, దాన్ని అడ్డుకున్న వ్యక్తులపై కేసులు మోపడం ఎంతటి దుర్మార్గమో రాష్ట్రప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

నేమకల్లు ప్రాంతంలోని క్వారీల వల్ల కాలుష్యం ఎక్కువైందని ప్రభుత్వమే వాటిని మూసేసిందని, దానికి సంబంధించిన కేసువిచారణ ఇప్పటికీ ఎన్జీటీలో కొనసాగుతోందన్నారు. అక్రమ క్వారీయింగ్‌కు కారకులైన ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డిని, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోకుండా, పేలుళ్లకు పాల్పడుతూ, సాక్ష్యాధారాలతోసహా పట్టుబడిన వ్యక్తులను అప్పగించినవారిపై అక్రమకేసులు పెట్టడం దారుణమన్నారు.

విలేకరుల సమావేశంలో నేమల్లు క్వారీలో పేలుళ్లకు కారకులైనవారిని పట్టుకున్న దృశ్యాలను, క్వారీయింగ్‌ జరుగుతున్న దృశ్యాలను మాజీమంత్రి కాలవ ప్రదర్శించారు. గ్రామస్తులకు పట్టుబడిన వ్యక్తులు, తాము ఎమ్మెల్యే క్వారీలో పనిచేస్తామని, తమకు శాసనసభ్యుడి బంధువులు తెలుసునని చెప్పడం జరిగిందన్నారు.

బొమ్మనహల్‌ పోలీసులకు వీడియోసాక్ష్యాలతో సహా నిందితులను అప్పగిస్తే, వారు నేరస్తులను వదిలేసి, తీవ్రమైన తప్పిదానికి పాల్పడ్డార న్నారు. జరిగిన విషయాన్ని అనంతపురం జిల్లా ఎస్పీకి తెలియచేశామని, అమాయకులైన నేమల్లు వాసులను కాపాడాలని విజ్ఞప్తి చేశామన్నారు. 

ఎమ్మెల్యే చెప్పిందే చట్టమన్నట్లు, ఆయన ఆదేశాలే పైనుంచి వచ్చే ఉత్తర్వులన్నట్లుగా స్థానిక పోలీసులు వ్యవహరిస్తున్న తీరుని కూడా మానవహక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్లామని, జరిగినఘటపై పూర్తిస్థాయిలో విచారణజరిపి నేమకల్లు వాసులకు న్యాయం చేస్తామని కమిషన్‌సభ్యులు హామీ ఇచ్చినట్లు శ్రీనివాసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇలియానాను అంతసేపు చూడగలమా? అదే కేసీఆర్ నైతేనా? వర్మ వ్యాఖ్యలు