ఏపీ రాజకీయాల్లో నేతల పార్టీ మార్పు మరోసారి హీటెక్కిస్తోంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ…. వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే దీపావళి తర్వాతే దీనిపై క్లారీటి రానుంది.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్‌ను కలిశారు వల్లభనేని వంశీ మోహన్. ఈ సమావేశంలో మంత్రులు పేర్ని నానితోపాటు కొడాలి నాని కూడా పాల్గొన్నారు. తనపై ఉన్న అక్రమ కేసులను జగన్‌కు వివరించినట్లు తెలుస్తోంది.
కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం జగన్‌తో వంశీ చెప్పారని సమాచారం. అయితే… టీడీపీకీ రాజీనామా చేసి వైసీపీలోకి రావాలని జగన్ సూచించినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి..
గురువారం చంద్రబాబును కలిసిన వల్లభనేని వంశీ.. శుక్రవారం బీజేపీ ఎంపీ సుజనాచౌదరితోనూ సమావేశయ్యారు. అనంతరం… సీఎం జగన్‌తో భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తాజా భేటీతో వంశీ పార్టీ మారడం ఖాయమైందని, వైసీపీలో వెళ్తారని ప్రచారం జరుగుతోంది.
దాదాపు ఏడేళ్ల తర్వాత జగన్‌తో వంశీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏడేళ్ల క్రితం విజయవాడలో రోడ్డుమీద జగన్, వంశీ హగ్ చేసుకున్నారు. అప్పట్నుంచే ఆయన వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు మళ్లీ సీఎం జగన్‌తో వంశీ భేటీ కావడం చూస్తే…. ఆయన కచ్చితంగా పార్టీ మారుతారని భావిస్తున్నారు.
ఇక…. మరో టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం సైతం పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. శుక్రవారం బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో ఆయన భేటీ కావడం చర్చనీయాంశం అయింది. వీరిద్దరూ తాజా రాజకీయ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
అయితే కేవలం ఆయనతో ఉన్న పరిచయంతోనే సమావేశమయ్యానని అంటున్నారు కరణం బలరాం. బీజేపీ సిద్ధాంతాలు నమ్మి వచ్చే వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని ఇటీవలే సుజనా చౌదరి చెప్పారు. ఇదే సమయంలోనే ఆయన టీడీపీ నేతలతో భేటీ అవుతుండటం ఆసక్తికరంగా మారింది..
అటు… టీడీపీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారన్న ప్రచారంపై ఆచీతూచీ స్పందిస్తున్నారు టీడీపీ అగ్రనేతలు. వంశీ కానీ కరణం బలరాంకానీ.. ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని, వారిద్దరూ ఏదైనా ప్రకటన చేశాకే… తాము మాట్లాడాలని భావిస్తున్నారు టీడీపీ నేతలు.