“కలానికి సంకెళ్లు...పత్రికా స్వేచ్ఛకు కళ్లెం” అని గత రెండు రోజులుగా పత్రికల్లో, ఛానళ్లలో ఆకర్షణీయమైన శీర్షికలు చూస్తున్నామని, కేంద్ర చట్టాల ప్రకారమే పత్రికల నియంత్రణ ఉంటుందని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేశారు.
శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని నాల్గవ బ్లాక్ లో ప్రచార విభాగంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని)తో కలిసి మంత్రి పేర్నినాని మీడియాతో మాట్లాడారు. పత్రికల్లో ఏ వార్త ఎక్కడ రాయాలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని అదే విధంగా పత్రికలకు, ఛానళ్లకు సర్టిఫికేషన్ లైసెన్స్ లు మంజూరు వ్యవహారాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేవని కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు మేరకు మంజూరు చేయడం జరుగుతుందని వెల్లడించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(A) ప్రకారం రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్ట్ ల స్వేచ్ఛకు వచ్చిన ముప్పు ఏమీ లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జీఓ పత్రికా స్వేచ్ఛ కు విఘాతం కలిగించేది కాదన్నారు. రాజకీయ దురుద్ధేశాలతో, అభూత కల్పనలతో, అసంబద్ధ వార్తలతో వాస్తవాలు విస్మరించి అవాస్తవాలు ప్రచురిస్తే, ప్రభుత్వంపై నిరాధార వార్తలు రాస్తే సంబంధిత కార్యదర్శి ఇచ్చే ఖండనను, స్పందనను ప్రచురించాలని జీఓ చెబుతోందని మంత్రి స్పష్టం చేశారు.
సంబంధిత శాఖా కార్యదర్శి ఇచ్చిన వివరణను ప్రచురించకపోతే న్యాయస్థానంను ఆశ్రయించేందుకు అనుమతించామని మంత్రి తెలిపారు. రీజాయిండర్ ఇచ్చినా ప్రచురించకపోతే ప్రభుత్వం ఏమి చేయాలని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కన్నా తామే ఉన్నతులమన్న భావనలో పత్రికా యాజమాన్యాలు ఉన్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు.
దేశంలోని మీడియా వేరు రాష్ట్రంలోని మీడియా వేరని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని మీడియా సంస్థలకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ప్రజలు మీడియా తీరును గమనిస్తున్నారని గుర్తుచేశారు. ఏ మీడియా ఎవరి పక్షాన నిలబడి వార్తలు రాస్తున్నాయో ప్రజలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని మంత్రి వెల్లడించారు.
విలేకరులు ఆధారాలు ఉండే వార్తలు రాయాలని మంత్రి సూచించారు. మీడియాపై తమ ప్రభుత్వానికి ఎలాంటి వివక్ష లేదని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం గురించి లేనిపోని కల్పిత వార్తలు రాయడం తప్పని తన ఉద్దేశమన్నారు.
వాస్తవాన్ని ప్రజలకు తెలియజేసేందుకు జీవో జారీ చేశామన్నారు. వాస్తవాలకు పూర్తి విరుద్ధంగా వార్తలు రాస్తే ఎలా అని ప్రశ్నించారు. తప్పుడు వార్త రాసిన వాళ్లే దానికి వివరణ ఇవ్వాలని చెప్పామన్నారు. వివరణ ఇవ్వకపోతే.. వారిపై సంబంధిత శాఖా కార్యదర్శి చర్యలు తీసుకుంటారని ఇందులో తప్పేమీ లేదన్నారు.
మీడియాకు ప్రభుత్వం సంకెళ్లు ఎక్కడ వేసిందో చెప్పాలన్నారు. ప్రాస కోసం, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వార్తలు రాయకూడదని హితువు పలికారు. తప్పుడు వార్తలు రాస్తే.. దానిని ఖండించే హక్కు ఆయా శాఖ ఉన్నతాధికారికి, ఆయా శాఖ మంత్రికి ఉంటుందని చెప్పారు.
విలేఖరులను ఇబ్బంది పెట్టడం.. కలానికి సంకెళ్లు వేయాలని తమ ఉద్దేశం కాదని, వాస్తవాలను ప్రజలకు తెలియజేసే నిజమైన జర్నలిజం మాత్రమే ముఖ్యమని మంత్రి అన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) మాట్లాడుతూ.. కలానికి సంకెళ్లు కాదు కులానికి సంకెళ్లు అనే భావనలో పత్రికా యాజమాన్యం ఉందన్నారు.
తప్పుడు వార్తలు కావాలని రాస్తే కోర్టులకు వెళ్ళమని సంబంధిత శాఖ కార్యదర్శలకు అనుమతించామని మంత్రి వెల్లడించారు. నీతి నిజాయితీ ఉన్న పత్రికలు, ఛానళ్లు, జర్నలిస్ట్ లకు ఈ జీవో వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండబోదని స్పష్టం చేశారు.
ప్రజలు వాస్తవాలను గమనించాలని మంత్రి కోరారు. కొన్ని పత్రికలు, ఛానళ్లు ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కును దుర్వినియోగం చేస్తున్నాయన్నారు.