కర్నాటక రాష్ట్రంలో మరోమారు అధికార మార్పిడి సంభవించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా, ఈ బీజేపీ పాలిత రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మరోమారు మార్చే అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం బసవరాజ్ బొమ్మై స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ ఊహాగానాలకు ఊతమిచ్చేలా ముఖ్యమంత్రి బొమ్మై చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి.
ఇటీవల తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్థానికులతో మాట్లాడుతూ, పదవులు, అధికారం ఏదీ శాశ్వతం కాదని చెప్పారు. ప్రజలు ప్రేమ మాత్రమే ఒక్కటే శాశ్వతమని, అది చాలని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని అనుక్షణం గుర్తుపెట్టుకునే నడుచుకుంటున్నానని చెప్పారు.
పైగా, నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పటికీ బసవరాజ్‌ను మాత్రమేనని, ముఖ్యమంత్రిని కాదని చెప్పారు. గతంలో హోం శాఖామంత్రిగా, సాగునీటి మంత్రిగా పని చేశానని గుర్తుచేసిన సీఎం బసవరాజ్... తాను ఎపుడు ఇక్కడు వచ్చినా బసవరాజ్‌గానే వస్తానని, తాను చేపట్టే పదవుల కంటే బసవరాజ్ మాత్రమే శాశ్వతంగా ఉంటాడని భావోద్వేగంగా చెప్పారు.