తాజ్‌మహల్‌లోని 22 గదులను శాశ్వతంగా మూసేశారని, వాటిలో హిందూ దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి చర్యలు చేపట్టేలా ఏఎస్‌ఐ ఆదేశించాలని కోరుతూ అలహాబాద్‌లో హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టేసింది.
ఈ నేపథ్యంలో.. తాజ్‌మహల్‌లోని గదులకు శాశ్వతంగా తాళాలు వేయలేదని, ఆ గదుల్లో ఎలాంటి విగ్రహాలు లేవని భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) అధికారులు తెలిపారు.
గదులకు మూడు నెలల కిందటే రిపేర్లు చేశామన్నారు. గోడలపై చిన్నచిన్న పగుళ్లను పూడ్చటంతోపాటు రీప్లాస్టరింగ్, కన్జర్వేషన్ పనులు జరిగాయని ఏఎస్‌ఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
కాగా... దీనిపై ఏఎస్‌ఐ అధికారులు స్పందించారు. తాజ్‌మహల్ బేస్‌మెంట్‌లో ఉన్న గదులను ఇటీవలే తెరిచామని తెలిపారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాలను పరిశీలించామని, తాజ్‌మహల్ గదుల్లో విగ్రహాలు ఉన్నట్టు ఎక్కడా ప్రస్తావన లేదని పేర్కొన్నారు.