Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తాజ్‌మహల్ ఒకప్పుడు తేజో మహాలయమా? ఆ 22 గదులలో ఏముంది?

tajmahal
, గురువారం, 12 మే 2022 (09:43 IST)
తాజ్‌మహల్‌ ఎగువ, దిగువ ప్రాంతాల్లో ఉన్న 22 గదులను తెరవాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌లో పిటిషన్‌ దాఖలైంది. అలాగే మూసి ఉన్న గదుల్లోని విగ్రహాలు, శాసనాలను కూడా శోధించేలా పురావస్తు శాఖను ఆదేశించాలని పిటిషన్‌లో డిమాండ్ చేశారు. 1631 నుంచి1653 సంవత్సరాల మధ్య 22 ఏళ్ళ కాలంలో తాజ్ మహల్ నిర్మించారనే మాట వాస్తవ విరుద్ధమని, అవివేకంతో కూడిన వాదన అని కూడా పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

 
అయోధ్యలోని బహ్రామౌ నివాసి అయిన డాక్టర్ రజనీశ్ సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. డెంటల్ సైన్స్ చదివిన రజనీశ్ సింగ్, బీజేపీ అయోధ్య జిల్లా కమిటీ సభ్యుడు, మీడియా కోఆర్డినేటర్ కూడా. అయితే, ఈ పిటిషన్‌ను తాను వ్యక్తిగతంగా వేశానని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన చెబుతున్నారు.

 
పిటిషనర్ ఏం చెప్పారు?
ఈ గదులను జాతీయ భద్రత దృష్ట్యానే మూసివేశారా అన్న సమాచారం కావాలని తాను 2019లో పురావస్తు శాఖను కోరినట్లు డాక్టర్ రజనీష్ సింగ్ చెప్పారు. కేవలం భద్రతా కారణాలతోనే ఈ గదులను మూసి ఉంచినట్లు ఆ శాఖ సమాధానం ఇచ్చిందని వెల్లడించారు. ఆ తర్వాత పురావస్తు శాఖ తన లేఖలకు స్పందించడం మానేసిందని, అందుకే, తాను పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని రజనీశ్ సింగ్ అన్నారు.

 
''నేను కోర్టుకెక్కాను. అక్కడున్న 20కి పైగా గదులను తెరవాలని కోరాను. కొన్నిసార్లు అందులో హిందువులు హనుమాన్ చాలీసా కూడా చదవడం చాలామంది చూసి ఉంటారు. కానీ, ముస్లింలు భిన్నమైన వాదనలు చేస్తున్నారు. అందులో ఏముందో అందరికీ తెలియాలి'' అన్నారు రజనీశ్ సింగ్. ''ఇక్కడ ఏవైనా ఘటనలు జరిగితే, అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠ మసకబారుతుంది. అందుకే ఈ గదులను తెరవాలని, వాస్తవాలను వెల్లడించాలని నా వ్యక్తిగత హోదాలో పిటిషన్ వేశాను'' అని రజనీశ్ కుమార్ అన్నారు.

 
''దీని కోసం పురావస్తు శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. వారి తనిఖీలలో ఏం బైటపడిందో బహిరంగ పరచాలి. అలా చేయడం వల్ల వివాదం శాశ్వతంగా ముగుస్తుంది. గతంలో శబరిమలలో ఏం జరిగిందో చూశాం. కోర్టు జోక్యంతో వివాదం సమసిపోయింది. ఇలాంటి వివాదాలు ఇంకా చాలా ఉన్నాయి. కోర్టుల జోక్యంతో వాటిని లేకుండా చేయవచ్చు'' అన్నారు రజనీశ్.

 
పిటిషనర్ డిమాండ్ ఏమిటి?
తాజ్‌మహల్‌ ఎగువ, దిగువ ప్రాంతాల్లో ఉన్న 22 గదులను భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) తెరిచి, అందులో ఏముందో దర్యాప్తు చేయాలన్నది పిటిషనర్ ప్రధాన డిమాండ్. తాజ్‌మహల్‌కు సంబంధించిన నిజానిజాలు బయటకు వచ్చేలా ప్రభుత్వం 'ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ'ని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని కూడా పిటిషనర్ కోరారు. ఈ విషయమై పిటిషనర్ తరపు న్యాయవాది రుద్ర విక్రమ్ సింగ్‌తో కూడా బీబీసీ మాట్లాడింది. ''మే 10న ఈ అంశంపై విచారణ జరగాల్సి ఉంది. అయితే న్యాయవాదుల సమ్మె కారణంగా జరగలేదు. ఈ విషయంలో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి కూడా నోటీసులు వెళ్లలేదు" అని ఆయన వెల్లడించారు.

 
ఈ పిటిషన్‌లో పేర్కొన్న 'తేజో మహాలయ' అని పిలిచే ఆలయం ఉనికి గురించి గతంలో కూడా చర్చ జరిగింది. పిటిషనర్ అభిప్రాయం ప్రకారం తేజో మహాలయను క్రీ.శ. 1212లో రాజు పర్మార్దిదేవ్ నిర్మించారు. తరువాత ఆ ఆలయం జైపూర్ రాజా మాన్‌సింగ్ ఆధీనంలోకి వెళ్లింది. ఆపై రాజా జై సింగ్ వారసత్వంగా వచ్చింది. తేజో మహాలయ భూమిని షాజహాన్ 1632లో ఆక్రమించారని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు. చరిత్రకారుడు పీఎన్ ఓక్ రచించిన 'తాజ్ మహల్: ఎ ట్రూ స్టోరీ' అనే పుస్తకంలోని అంశాల ఆధారంగా తాజ్‌మహల్‌ను 'తేజో మహాలయ'గా పిటిషనర్ పేర్కొన్నారు.

 
తాజ్‌మహల్, 'తేజో మహాలయ'పై హిందువులు, ముస్లింల మధ్య వివాదం చాలా కాలంగా నడుస్తోందని, ఈ కారణంగా ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తాజ్‌మహల్‌‌ను రాష్ట్రంలోని అధికారిక పర్యటక ప్రాంతాల జాబితాలో చేర్చలేదని పిటిషనర్ పేర్కొన్నారు. అయోధ్యకు చెందిన జగద్గురు పరమహంస ఆచార్య కాషాయ వస్త్రాలు వేసుకొని వచ్చిన కారణంగా తాజ్ మహల్‌లో శివుడిని పూజించకుండా అడ్డుకున్నారని కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. తాజ్‌ మహల్‌లో మూసి ఉన్న కొన్ని గదుల వెనక శివాలయం ఉందని, వాటిని ప్రజల సందర్శనార్థం తెరవాలని పరమహంస ఆచార్య పేర్కొన్నారు.

 
తాజ్ మహల్ వెలుపల లడ్డూ పంపిణీ
హైకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలైన తర్వాత ఆగ్రాలో హిందూ మహాసభ కార్యకర్తలు తాజ్ మహల్ గేటు వెలుపల లడ్డూలను పంచిపెట్టారు. అయితే, అధికారులు వారిని అడ్డుకున్నారు. ''తేజో మహాలయ విషయంలో మా మొదటి విజయాన్ని ఆపడం ద్వారా అధికారులు తమ ద్వంద్వ మనస్తత్వాన్ని బైటపెట్టుకున్నారు. మేం ఇక్కడ చాలాసార్లు హారతి ఇచ్చాం. మా పోరాటం ఆగదు'' అని హిందూ మహాసభ ప్రతినిధి, ఆగ్రా నివాసి సంజయ్ జాట్ అన్నారు.

 
హిందూ మహాసభ కార్యకర్తలు తాజ్‌మహల్‌లోకి ప్రవేశించి, హిందూ మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి ఇంతకు ముందు పలుమార్లు ప్రయత్నించగా, అధికారులు వారిని అడ్డుకున్నారు. ముస్లిం మత పెద్దలు ఈ ప్రయత్నాలు తప్పుబడుతున్నారు. ''ఈ పిటిషన్‌కు ఎలాంటి అర్హత లేదు. అర్ధం లేని సమస్యను తీసుకొచ్చి ఇక్కడి శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు'' అని తాజ్‌ మహల్ కాంప్లెక్స్‌లో కార్యక్రమాలను నిర్వహిస్తున్న తాజ్ మహల్ మస్జిద్ ఇంతేజామియా కమిటీ చైర్మన్ ఇబ్రహీం జైదీ అన్నారు.

 
'ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్' వర్తిస్తుందా?
1947 ఆగస్ట్ 15కు ముందు ఉనికిలో ఉన్న ఏ మతానికి చెందిన ప్రార్థనా మందిరాన్ని అయినా ఇతర మతాల ప్రార్థనా స్థలంగా మార్చలేమని పీవీ నరసింహారావు ప్రభుత్వ హయాంలో 1991లో రూపొందించిన ప్రార్థనా స్థలాల చట్టం పేర్కొంది. ఇదే విషయాన్ని పిటిషనర్ తరఫు లాయర్‌ రుద్ర విక్రమ్ సింగ్‌ ముందు ప్రస్తావించినప్పుడు ''ఈ పిటిషన్‌లో గదులను తెరవడం గురించే డిమాండ్ ఉంది. చట్టం ప్రస్తావన లేదు'' అని అన్నారు.

 
తాజ్ మహల్‌ను ఎప్పుడు, ఎందుకు నిర్మించారు?
17వ శతాబ్దంలో తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం షాజహాన్ తాజ్ మహల్‌ను నిర్మించారు. 1560 ప్రాంతంలో తాజ్ మహల్‌ను దిల్లీలోని హుమాయున్ సమాధి తరహాలో నిర్మించారు. ఇందుకోసం 42 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. 139 అడుగుల ఎత్తులో నాలుగు మినార్లు, వాటిపైన ఒక ఛత్రీని ఉంచారు. తాజ్ మహల్ నిర్మాణ పనులు జనవరి 1632లో ప్రారంభమై 1655లో పూర్తయ్యాయి.

 
షాజహాన్ కాలం నాటి చరిత్రకారుడు అబ్దుల్ హమీద్ లాహోరీ రాసిన దాని ప్రకారం ఆ సమయంలో తాజ్ మహల్ నిర్మాణానికి రూ.50 లక్షలు ఖర్చయినట్లు అంచనా. అయితే, ఈ ఖర్చు కేవలం తాజ్‌ మహల్‌ను నిర్మించిన కార్మికులకు చెల్లించిన వేతనం మాత్రమేనని, దీని కోసం ఉపయోగించిన వస్తువుల ధర ఇందులో కలపలేదని మరికొందరు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. తర్వాత దొరికిన పత్రాల ఆధారంగా కొందరు చరిత్రకారులు తాజ్ మహల్ నిర్మాణానికి రూ. 4 కోట్లు ఖర్చయినట్లు అంచనా వేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తొలి ప్రియుడిని రెండో ప్రియుడితో హత్య చేయించిన వివాహిత