2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అమృత్ కాలానికి ఇది తొలి పద్దు అని వెల్లడించారు. సప్తర్షి (సప్త రుషుల) రీతిలోనే బడ్జెట్‌లో ఏడు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆమె ఉభయ సభల సభ్యుల సమక్షంలో వెల్లడించారు.
ఈ సప్తర్షిలలో సమ్మిళత వృద్ధి, చిట్టచివరి వ్యక్తికి కూడా లబ్ధి చేకూరాలి, మౌలిక సదుపాయాలు- పెట్టుబడులు, సామర్థ్యాలను వెలికితీయడం, హరిత వృద్ధి, యువత, ఆర్థిక రంగం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు.
అమృత కాలంలో ప్రవేశ పెడుతున్న ఈ తొలిబడ్జెట్‌లో అన్ని వర్గాల సంక్షేమానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. తొమ్మిదేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించామని చెప్పారు.
మరోవైపు, నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. స్వాతంత్ర్యం భారతదేశంలో వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా ఖ్యాతిగడించారు. ఈ జాబితాలో అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్, మొరార్జీ దేశాయ్ ఉన్నారు. 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీతారామన్ వరుసగా బడ్జెట్ ప్రవేశపెడుతూ వస్తున్నారు.