లాభాపేక్షలేని వినియోగదారుల హక్కుల సేవా సంస్థ కన్స్యూమర్ ఆన్‌లైన్ ఫౌండేషన్ (సీఓఎఫ్) నేడు నూతన కోట్పా సవరణ బిల్లు 2020 అమలులో ఎదురయ్యే సవాళ్లపై సమగ్ర అధ్యయన ఫలితాలను విడుదల చేసింది. పొగాకు నియంత్రణ నిబంధనలపై ప్రజల అభిప్రాయాలు శీర్షికన విడుదల చేసిన ఈ నివేదికలో భారతదేశ వ్యాప్తంగా 5116 మంది అభిప్రాయాలను సేకరించారు. తద్వారా పొగాకు నియంత్రణ పరంగా ప్రజల అభిప్రాయాలను స్పష్టంగా వెలుగులోకి తీసుకువచ్చారు.
ఈ అధ్యయన ఫలితాలను గురించి సుప్రసిద్ధ కన్స్యూమర్ యాక్టివిస్ట్ మరియు కన్స్యూమర్ ఆన్‌లైన్ ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ ప్రొఫెసర్ బెజోన్ మిశ్రా మాట్లాడుతూ, కోట్పా చట్ట సవరణల పట్ల ప్రజల అభిప్రాయాలను తీసుకోవడంతో పాటుగా విధాన నిర్ణేతలు పరిగణలోకి తీసుకునేలా వాటిని సమర్పించింది. ప్రతిపాదిత చట్ట సవరణల వల్ల అక్రమ పొగాకు వాణిజ్యం దేశంలో పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అదీగాక పొగాకు వినియోగం తగ్గడానికి బదులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అని అన్నారు.
ఆయనే మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పొగాకు వాణిజ్యం నియంత్రించాల్సిన ఆవశ్యకత ఉంది. అదే రీతిలో సమానమైన పన్నుల విధానం ఉంటే భారతీయ వినియోగదారులను నాణ్యత లేని పొగాకు ఉత్పత్తుల బారి నుంచి కాపాడవచ్చన్నారు.
మార్కెట్ వాటా పరంగా అతి తక్కువగా ఉన్నప్పటికీ సిగిరెట్ల మీదనే అధికంగా బిల్లులో దృష్టి కేంద్రీకరించారన్న అంశాన్ని ఈ నివేదికలో స్పష్టంగా వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం భారతదేశంలో అధిక శాతం మంది పొగ రహిత పొగాకు అంటే ఖైనీ, పొగాకుతో బీటెల్ క్విడ్ , జర్ధా వంటివి వినియోగిస్తున్నారు. ఇదే అంశాన్ని ఈ అధ్యయనంలో కూడా వెల్లడించారు. దాదాపు 75% మందికి పైగా పొగాకు నమలడాన్ని ఇష్టపడుతుంటే, కేవలం 20.89% మాత్రమే సిగిరెట్ కాలుస్తున్నారు. అంతేకాదు, దాదాపు 57% మంది స్పందన దారులు తాము తమ 18సంవత్సరాల వయసులోనే పొగాకు వినియోగం ఆరంభించినట్లుగా వెల్లడించారు.....