తనకు డబ్బుకు కొదవలేదని, అదేసమయంలో తన బుర్రలో రూ.200 కోట్ల విలువైన ఆలోచనలు ఉన్నాయని, పైగా తాను ఎవరినీ మోసం చేయకుండానే డబ్బు సంపాదిస్తున్నానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, తనకు నెలకు రూ.200 కోట్ల ఆదాయం వస్తోందన్నారు. 'ఎవరినీ మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. నా వ్యాపారాలు నిజాయితీతో నడుస్తున్నాయి' అని ఆయన నొక్కి చెప్పారు. తన కుమారులు వ్యాపారాల్లో ఉన్నప్పటికీ, తాను వారికి కేవలం సలహాదారుడిగా మాత్రమే ఉన్నానని ఆయన తెలిపారు.
'ఇటీవల నా కుమారుడు ఇరాన్ నుంచి 800 కంటైనర్ల ఆపిల్స్‌ను దిగుమతి చేశాడు. అలాగే 1000 కంటైనర్ల అరటిపళ్లను ఎగుమతి చేశాడు. మా వ్యాపారాలు వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకే. నాకు డబ్బుకు కొదవలేదు' అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ20 ఇంధనం, 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై వస్తున్న విమర్శలపై గడ్కరీ తీవ్రంగా స్పందించారు. ఈ విధానం వల్ల తన కుటుంబానికి లాభం చేకూరుతోందంటూ వస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని ఆయన ఖండించారు.
'ఇది పెట్రోల్ లాబీల కుట్ర. రాజకీయంగా నన్ను లక్ష్యంగా చేసుకుని పెయిడ్ సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ20పై దాఖలైన పిల్‌ను తిరస్కరించింది' అని ఆయన గుర్తు చేశారు. ఈ ఇంధనం సురక్షితమైనదని, ఇది దిగుమతి ప్రత్యామ్నాయంగా, కాలుష్యాన్ని తగ్గించేందుకు, రైతులకు లాభం చేకూర్చే విధంగా రూపొందించామని గడ్కరీ వివరించారు.